PM Modi : 43 ఏళ్ల తర్వాత తొలిసారి.. నార్వే గడ్డపై మోదీ అడుగు.. యూరప్ దేశాలకు కొత్త బాస్‎గా భారత్?

PM Modi : మే 15 నుంచి 20 వరకు ప్రధాని మోదీ ఐదు దేశాల్లో పర్యటించనున్నారు. యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలతో ఇంధనం, టెక్నాలజీ రంగాల్లో కీలక ఒప్పందాలు జరగనున్నాయి.

CR Reddy
Published on: 12 May 2026 7:27 AM IST
PM Modi
X

PM Modi

PM Modi : ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్న వేళ, భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. మే 15 నుంచి 20 వరకు మొత్తం ఐదు దేశాల్లో (యూఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ) ఆయన పర్యటించనున్నారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన భద్రత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, సెమీకండక్టర్ రంగంలో పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ఇది కేవలం సాధారణ పర్యటన మాత్రమే కాదు.. అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తన బలాన్ని నిరూపించుకునే ఒక వ్యూహాత్మక దౌత్యంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

యూఏఈతో ఇంధన బంధం మరింత గట్టిగా

ప్రధాని తన పర్యటనను మే 15న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో ప్రారంభిస్తారు. యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మోదీ భేటీ కానున్నారు. చమురు ధరల్లో అస్థిరత నెలకొన్న తరుణంలో భారత్‌కు ఇంధన భద్రత చాలా కీలకం. ప్రస్తుతం మన దేశానికి యూఏఈ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ భేటీలో పెట్టుబడులతో పాటు అక్కడున్న 45 లక్షల మంది భారతీయుల సంక్షేమంపై కూడా కీలక చర్చలు జరగనున్నాయి.

నెదర్లాండ్స్‌లో సెమీకండక్టర్లపై నజర్

మే 15 నుంచి 17 వరకు ప్రధాని నెదర్లాండ్స్‌లో పర్యటిస్తారు. అక్కడ ప్రధాని రాబ్ జెట్టెన్, రాజకుటుంబంతో భేటీ అవుతారు. ముఖ్యంగా సెమీకండక్టర్ల తయారీ, గ్రీన్ హైడ్రోజన్, నీటి యాజమాన్యం వంటి అంశాల్లో సహకారంపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. యూరప్‌లో భారత్‌కు ఉన్న అతిపెద్ద వాణిజ్య భాగస్వాముల్లో నెదర్లాండ్స్ ఒకటి. టెక్నాలజీ రంగంలో భారత్ దూసుకుపోవడానికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడనుంది.

స్వీడన్, నార్వే పర్యటనలు

మే 17న స్వీడన్‌కు చేరుకోనున్న మోదీ, అక్కడి పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), స్పేస్ టెక్నాలజీపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఆ తర్వాత మే 18న నార్వేకు వెళ్తారు. ఒక భారత ప్రధాని 43 ఏళ్ల తర్వాత నార్వేను సందర్శించడం ఇదే మొదటిసారి. అక్కడ జరిగే ఇండియా-నార్డిక్ సమ్మిట్‌లో ఐదు దేశాల (నార్వే, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, స్వీడన్) ప్రధానులతో మోదీ భేటీ అవుతారు. బ్లూ ఎకానమీ, గ్రీన్ టెక్నాలజీలో పెట్టుబడులే దీని ప్రధాన ఎజెండా.

ఇటలీలో ముగియనున్న పర్యటన

చివరి విడతగా మే 19-20 తేదీల్లో మోదీ ఇటలీలో పర్యటిస్తారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ అయి రక్షణ, స్వచ్ఛ ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో 2025-2029 వ్యూహాత్మక ప్రణాళికపై చర్చలు జరుపుతారు. గత కొన్నేళ్లుగా భారత్-ఇటలీ మధ్య సంబంధాలు ఎంతో మెరుగుపడ్డాయి. ఈ పర్యటనతో యూరప్ మరియు పశ్చిమ దేశాలతో భారత్ బంధం మరింత పటిష్టం కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story