PM Modi : తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ అడుగు.. రూ.9,400 కోట్ల వరాల జల్లు

PM Modi : ప్రధాని మోదీ ఇవాళ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మొత్తం రూ.9,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

CR Reddy
Published on: 10 May 2026 8:10 AM IST
PM Modi
X

PM Modi

PM Modi : వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ తొలిసారిగా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, రాజకీయంగా కూడా ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పరేడ్ గ్రౌండ్స్ సాక్షిగా విపక్షాలపై గర్జించేందుకు మోదీ సిద్ధమయ్యారు. ప్రధాని మోదీ ఇవాళ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తెలంగాణలో గడపనున్నారు. ఆయన పర్యటన మధ్యాహ్నం 2:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీకి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6:25 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరవుతారు. చివరగా రాత్రి 7:20 గంటలకు తన పర్యటన ముగించుకుని తిరిగి గుజరాత్‌కు బయలుదేరుతారు.

తెలంగాణకు రూ.9,400 కోట్ల నిధుల వరద

ఈ పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్ర అభివృద్ధికి భారీ నిధులను కేటాయించారు. మొత్తం రూ.9,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధానంగా రూ.3,175 కోట్లతో మహబూబ్ నగర్ వరకు నిర్మించే 4 వరుసల రహదారికి శంకుస్థాపన చేస్తారు. జహీరాబాద్‌లో రూ.2,360 కోట్లతో నిర్మించనున్న స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ పనులకు కూడా శ్రీకారం చుట్టనున్నారు. కాజీపేట-విజయవాడ మధ్య పూర్తి చేసిన మూడో రైల్వే లైన్, వరంగల్ పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ వంటి కీలక ప్రాజెక్టులు తెలంగాణ ప్రగతికి ఊతమివ్వనున్నాయి.

పరేడ్ గ్రౌండ్స్‌లో మహా సభ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే బహిరంగ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుమారు 2 లక్షల మందిని తరలించి తమ బలాన్ని నిరూపించుకోవాలని కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, మార్పు కోసం బీజేపీ వైపు చూస్తున్నారని మోదీ ఇప్పటికే చేసిన ట్వీట్ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సభలో మోదీ చేసే ప్రసంగం రాబోయే ఎన్నికలకు దిశానిర్దేశం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భద్రత, ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని రాక దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్, మాదాపూర్, బేగంపేట పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story