PM Modi: నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డు బద్దలు.. జూన్ 10న ప్రధాని మోదీ సరికొత్త చరిత్ర!

PM Modi: భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించనున్నారు. జూన్ 10 నాటికి నిరంతరాయంగా అత్యధిక కాలం పాలించిన ప్రజాస్వామ్య ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును మోదీ అధిగమించనున్నారు.

Arun Chilukuri
Published on: 5 Jun 2026 11:57 AM IST
PM Modi
X

PM Modi: నెహ్రూ పేరిట ఉన్న దశాబ్దాల రికార్డు బద్దలు.. జూన్ 10న ప్రధాని మోదీ సరికొత్త చరిత్ర!

PM Modi: దేశ రాజకీయ చరిత్రలో ప్రధాని మోడీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు. దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా.. జవర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును జూన్‌ 10న మోడీ అధిగమించనున్నారు. దేశంలో మొదటి సాధరణ ఎన్నికలు 1951-52 లో జరిగాయి. ఆ ఎన్నికల అనంతరం తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా నెహ్రూ మే 13, 1952న ప్రమాణ స్వీకారం చేశారు. నాటి నుంచి మే 27, 1964న ఆయన మరణించే వరకు.. మొత్తం 4,398 రోజుల పాటు ఎలాంటి విరామం లేకుండా ప్రధానిగా కొనసాగారు.

నరేంద్ర మోడీ మే 26, 2014న తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది జూన్‌ 10 నాటికి విరామం లేకుండా 4,399 రోజులు పూర్తి చేసుకోనున్నారు. దీంతో నెహ్రూ రికార్డును ఒక్క రోజు తేడాతో అధిగమించి, దేశంలోనే సుధీర్ఘ నిరంతరాయంగా పాలించిన ఏకైక ప్రజాస్వామ్య అధినేతగా మోడీ నిలవనున్నారు. కాగా నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ జనవరి 24, 1966 నుంచి మార్చి 24, 1977 వరకు వరుసగా 4,077రోజుల పాటు ప్రధానిగా ఈ సేవలందించారు.

నెహ్రూ, మోడీ.. ఇద్దరూ భారతీయ రాజకీయాలను దశాబ్దాలపాటు శాసించినవారే, అయితే, ఈ ఇద్దరు నేతల మధ్య కేవలం పదవీ కాలంలోనే కాదు.. దేశ నిర్మాణంలో పౌరుల పాత్రను వీక్షించే విధానంలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీకి నాయకత్వం వహించిన నెహ్రూకు ఆ కాలంలో పెద్దగా జాతీయ స్థాయి ప్రతిపక్షం ఎదురుకాలేదూ. ఆయన సెక్యులర్‌ ఐకత్య సిద్ధాంతంతో దేశాన్ని నడిపించారు. అత్యంత తీవ్రమైన రాజకీయ పోటీ, ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం ఉన్న తరుణంలో మోడీ ఎదిగారు. గుజరాత్‌ సీఎంగా వరుసగా మూడుసార్లు గెలిచారు. 2014లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏను ఓడించి బీజేపీకి స్పష్టమైన మెజారిటీ తెచ్చిపెట్టారు. అభివృద్ధి మంత్రం, హిందుత్వసాంస్కృతిక జాతీయవాతంతో మోడీ దేశ రాజకీయాలను మార్చేశారు.

మోడీ పాలనలో ఎన్నో సాధ్యమయ్యాయి. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు, ముస్లిం మహిళలకు ఊరటనిస్తూ ట్రిపుల్‌ తలాక్‌ నిషేధం, అలాగే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం వంటి.. చారిత్రాత్మక మార్పులు సాధ్యపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి జూన్‌ 10న ప్రధాని మోడీ సాధించబోయే అరుదైన రికార్డు చారిత్రక మైలురాయిగా నిలిచిపోనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story