PM Modi: కేబినెట్ విస్తరణకు వేళాయెనా?.. మంత్రులతో ప్రధాని మోదీ సుదీర్ఘ భేటీ

PM Modi: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయనే వార్తలు దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

CR Reddy
Published on: 8 Sept 2026 7:29 AM IST
PM Modi
X

PM Modi

PM Modi: కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే భారీ మార్పులు చేర్పులు జరగనున్నాయనే వార్తలు దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం డజనుకు పైగా కేంద్రమంత్రులతో 3 గంటలకు పైగా అత్యంత కీలకమైన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది. ప్రధానమంత్రి కార్యాలయం సేవా తీర్థంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ కేబినెట్ హోదా ఉన్న సీనియర్ మంత్రిని కానీ, ఉన్నతాధికారులను కానీ అనుమతించకుండా కేవలం రాజ్యమంత్రులతోనే ప్రధాని నేరుగా సమావేశం కావడం ఇది తొలిసారి. వ్యవసాయం, విద్య, గ్రామీణాభివృద్ధి, సామాజిక న్యాయం వంటి కీలక శాఖల మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయా శాఖల్లో ఇప్పటివరకు చేపట్టిన సంక్షేమ పథకాలు, తెచ్చిన సంస్కరణలు, సాధించిన పురోగతిపై ప్రధాని మోదీ నేరుగా నివేదికలు అడిగి తెలుసుకున్నారు.

సమయపాలన, నాణ్యతపై ప్రధాని దిశానిర్దేశం

ఈ సమావేశంలో ప్రధాని మోదీ మంత్రులకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా, ప్రతి పథకం ఆశించిన లబ్ధిదారులకు నేరుగా చేరేలా పారదర్శకత పాటించాలని సూచించారు. చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. మంత్రుల పనితీరును అంచనా వేయడానికే ఈ తరహా భేటీలను నిర్వహిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. రాబోయే వారాల్లో మరికొందరు రాజ్యమంత్రులతో కూడా ప్రధాని సిరీస్ మీటింగ్‌లు నిర్వహించనున్నారు.

కేబినెట్ మార్పుల ఊహాగానాలు

వరుసగా జరుగుతున్న ఈ సమీక్షా సమావేశాలను రాబోయే కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందస్తు కసరత్తుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ సంస్కారాలు, గ్రామీణాభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై గతంలో కార్యదర్శుల సాధికారిక బృందాలతో ప్రధాని సమావేశమయ్యారు. ఇప్పుడు నేరుగా మంత్రుల పనితీరును అంచనా వేస్తుండటంతో, మెరుగైన ప్రదర్శన కనబరచని వారిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది.

గుజరాత్, మహారాష్ట్ర పర్యటనలో ప్రాజెక్టుల వరద

ఒకవైపు రాజకీయ సమీక్షలు నిర్వహిస్తూనే, మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధాని స్పీడు పెంచారు. గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించి ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా మరికొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. వడోదరాలో బహుళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడంతో పాటు, ముంబైలో జరిగే గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రారంభించనున్నారు. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌లోని కీలక భాగాలను జాతికి అంకితం చేయడం ద్వారా రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తేనున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story