PM Modi: రాష్ట్రాలకు ప్రధాని మోదీ జల సూత్రం.. జల వివాదాలను సహకారంతోనే పరిష్కరించుకోవాలి!
PM Modi: అంతర్రాష్ట్ర జల వివాదాలను రాష్ట్రాలు సహకార ధోరణితో పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
PM Modi: రాష్ట్రాలకు ప్రధాని మోదీ జల సూత్రం.. జల వివాదాలను సహకారంతోనే పరిష్కరించుకోవాలి!
PM Modi: దేశంలో దీర్ఘకాలంగా నలుగుతున్న అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు పరస్పర సహకార ధోరణితో, సామరస్య పూర్వకంగా నీటి వివాదాలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, సకాలంలో అనుమతులు సాధించడం ద్వారా ఇలాంటి జల సమస్యలను సులభంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల మధ్య సాగుతున్న ‘కెన్-బెట్వా’ నదుల అనుసంధాన ప్రాజెక్టు దేశానికే ఒక నమూనాగా (Model) నిలవాలని ప్రధాని ఆకాంక్షించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రూ.30 వేల కోట్ల విలువైన కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుతో పాటు వివిధ రాష్ట్రాల్లో సాగుతున్న పలు అభివృద్ధి పనులపై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల అమలులో జరిగే ఆలస్యం దేశ ప్రగతికి ఎలా అవరోధంగా మారుతుందో వివరించారు. "ఏదైనా ఒక ప్రాజెక్టు అమలులో జాప్యం జరిగితే.. అది కేవలం నిర్మాణ ఖర్చుల (Project Cost) పెరుగుదలకు మాత్రమే దారితీయదు. దేశ పౌరులకు సకాలంలో అందాల్సిన అవసరమైన సదుపాయాలు, ఫలాలు అందకుండా దూరం చేస్తుంది. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి మరింత చురుకుగా పనిచేయాలి." అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దేశంలో నీటి భద్రతను పెంపొందించేందుకు నదుల అనుసంధానం, జల సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం వంటి అంశాల్లో ఉన్న అవకాశాలను రాష్ట్రాలు త్వరితగతిన గుర్తించాలని కోరారు. ‘స్వచ్ఛభారత్ మిషన్- అర్బన్ 2.0’ పురోగతిని సమీక్షించిన ప్రధాని.. నగరాల్లో ఇళ్లపై (రూఫ్‌టాప్) సోలార్ ప్యానెళ్ల వినియోగాన్ని మరింత వేగవంతం చేయాలన్నారు.
వ్యవసాయ, సాగునీటి కాల్వల వెంబడి, కాల్వలపై (Canal-top Solar) సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు చేసే మార్గాలను అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీనివల్ల అటు విద్యుత్ ఉత్పత్తి అవ్వడమే కాకుండా, ఇటు కాల్వల్లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛతను పెంపొందించేందుకు ఘన వ్యర్థాల నిర్వహణకు (Solid Waste Management) సంబంధించిన మౌలిక సదుపాయాలను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.




