PM Modi: 25 ఏళ్ల ప్రజాసేవ అద్భుతమైన మైలురాయి: దేశాభివృద్ధే నా జీవితాశయం..!

PM Modi: ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా దిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప్ సభలో మాట్లాడారు. ప్రత్యర్థుల విమర్శలే తనను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.

Arun Chilukuri
Updated on: 7 Oct 2026 1:17 PM IST
PM Modi
X

PM Modi: 25 ఏళ్ల ప్రజాసేవ అద్భుతమైన మైలురాయి: దేశాభివృద్ధే నా జీవితాశయం..!

PM Modi: ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల నిరంతర అధికార ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా భావోద్వేగ ప్రసంగం చేశారు. దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా దేశీయంగా, అంతర్జాతీయంగా సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో ‘మనం చేయగలం’ అనే సరికొత్త నినాదాన్ని ఆయన అందించారు.

గుజరాత్ సీఎంగా ప్రమాణం చేసినప్పుడు తాను ఇంతగా ఆలోచించలేదని, 25 ఏళ్లుగా నిరంతర ప్రజాసేవ అందిస్తానని నాడు ఊహించలేదని మోదీ గుర్తుచేసుకున్నారు. తనను ఇంతగా ఆదరిస్తున్న దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.

ప్రజాసేవలో ఉన్నప్పుడు విమర్శలు వస్తూనే ఉంటాయని, వాటిని పట్టించుకుంటే ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తనను విమర్శిస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తానని, తనను రాజకీయంగా బలోపేతం చేసేది తన ప్రత్యర్థులేనని, వారు ఎంతగా విమర్శిస్తే తాను అంతగా ఆలోచిస్తానని పేర్కొన్నారు.

2047 నాటికి ‘వికసిత్ భారత్‌’ను సాధించి తీరుతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా భారత్ ఎదుగుతోందని, అంతరిక్షంలో అడుగుపెట్టడం, ఒలింపిక్స్ నిర్వహణ వంటివన్నీ సాధ్యమేనని పేర్కొన్నారు.

గత ప్రభుత్వాలు ఉగ్రవాదంపై మెతక వైఖరి ప్రదర్శించాయని, కానీ దేశ భద్రతకు ముప్పు వస్తే ప్రతిఘటన ఎలా ఉంటుందో తాము చేసి చూపించామని మోదీ గర్వంగా వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.