PM Surya Ghar: పేదల అకౌంట్లోకి నేరుగా రూ.78 వేలు!

PM Surya Ghar: పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజనతో మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకొని నెలకు 300 యూనిట్ల ఉచిత కరెంట్ పొందండి.

Naresh.k
Published on: 2 July 2026 7:33 AM IST
PM Surya Ghar
X

PM Surya Ghar: పేదల అకౌంట్లోకి నేరుగా రూ.78 వేలు!

PM Surya Ghar Muft Bijli Yojana: కరెంట్ బిల్లులు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి వచ్చిందంటే చాలు.. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకంతో మీటర్లు జెట్ స్పీడ్‌తో పరిగెడతాయి. నెల తిరిగేసరికి వచ్చే బిల్లును చూసి గుండె గుభేల్మనడం మధ్యతరగతి కుటుంబాలకు అలవాటే. అయితే, ఈ కరెంట్ బిల్లుల భారానికి శాశ్వతంగా చెక్ పెడుతూ, ఉచితంగా విద్యుత్‌ను అందించడమే కాకుండా.. అదనపు ఆదాయాన్ని కూడా తెచ్చిపెట్టే ఒక అద్భుతమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. అదే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం సూర్య ఘర్ మఫ్త్ బిజిలీ యోజన.

2024 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభమైన ఈ సరికొత్త విప్లవాత్మక పథకం ద్వారా దేశంలోని కోట్లాది పేద, మధ్యతరగతి కుటుంబాలకు వెలుగులు పంచడమే కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. మీ ఇంటి డాబా ఖాళీగా ఉంటే చాలు.. అక్కడ ఒక చిన్న సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ప్రతి నెలా ఏకంగా 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను సొంతం చేసుకోవచ్చు. సొంతంగా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని అని భయపడుతున్నారా? మీ భయాలను పటాపంచలు చేస్తూ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం భారీ సబ్సిడీని అందిస్తోంది. మీ ఇంటి అవసరాలను బట్టి ఏర్పాటు చేసుకునే సోలార్ ప్లాంట్ సామర్థ్యం ఆధారంగా ఈ సబ్సిడీ లభిస్తుంది.

ఒకటి నుంచి ఏడు కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునే వారికి ముప్పై వేల రూపాయల నుండి అరవై వేల రూపాయల వరకు సబ్సిడీ అందుతుంది. ఒకవేళ మీరు రెండు నుంచి మూడు కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే అరవై వేల రూపాయల నుండి డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు భారీ సబ్సిడీ లభిస్తుంది. ఇక మూడు కిలోవాట్ల కంటే ఎక్కువ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునే వారికి గరిష్టంగా డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. అత్యంత పారదర్శకంగా ఈ సబ్సిడీ సొమ్ము నేరుగా లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాలోనే జమ కావడం విశేషం.

ఈ పథకంలో ఉన్న అసలైన మజా ఏమిటంటే.. కేవలం ఉచిత కరెంట్ మాత్రమే కాదు, మీ ఇంటి అవసరాలకు పోను మిగిలిపోయిన అదనపు విద్యుత్‌ను మీరు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు. నెట్ మీటరింగ్ విధానం ద్వారా మిగిలిన కరెంట్‌ను స్థానిక డిస్కంలకు విక్రయించి, ప్రతి నెలా చక్కటి అదనపు ఆదాయాన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. అంటే ఒకప్పుడు కరెంట్ బిల్లు కట్టిన మీ చేతులతోనే, ఇకపై కరెంట్ అమ్మిన సొమ్మును అందుకోవచ్చన్నమాట.

ఈ అద్భుతమైన పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ప్రాథమిక అర్హతలు ఉండాలి. దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడానికి అనువైన సొంత ఇల్లు కలిగి ఉండాలి. అలాగే సదరు ఇంటికి అధికారిక విద్యుత్ కనెక్షన్ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా, గతంలో ప్రభుత్వం నుంచి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎలాంటి సబ్సిడీ పొంది ఉండకూడదు.

ఈ పథకం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఆన్‌లైన్ విధానం ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా పీఎం సూర్య ఘర్ అధికారిక వెబ్‌సైట్ (pmsuryaghar.gov.in)ను సందర్శించాలి. అక్కడ కనిపించే రూఫ్ టాప్ సోలార్ కోసం దరఖాస్తు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం మీ రాష్ట్రం, జిల్లా , విద్యుత్ పంపిణీ సంస్థ వంటి వివరాలను నమోదు చేయాలి. మీ ఎలక్ట్రిసిటీ కన్జూమర్ నెంబర్, మొబైల్ నెంబర్‌ను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత దరఖాస్తు ఫారంలో అడిగిన పూర్తి వివరాలను జాగ్రత్తగా నింపాలి.

మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత డిస్కం అధికారులు మీ దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇస్తారు. ఆమోదం లభించిన వెంటనే, పోర్టల్‌లో నమోదైన గుర్తింపు పొందిన వెండర్ ద్వారా మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ప్యానెల్స్ ఏర్పాటు పూర్తయిన తర్వాత ఆ వివరాలను పోర్టల్‌లో నమోదు చేసి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.

డిస్కం అధికారులు వచ్చి నెట్ మీటర్ అమర్చిన తర్వాత, అంతా సజావుగా ఉందో లేదో తనిఖీ చేసి మీకు ఒక కమిషనింగ్ సర్టిఫికేట్ అందిస్తారు. చివరిగా, మీ బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు ఒక క్యాన్సిల్డ్ చెక్ ప్రతిని పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన కేవలం ముప్పై రోజుల్లోనే ప్రభుత్వం అందించే భారీ సబ్సిడీ సొమ్ము నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story