NEET Exam Scam: హీరోలకంటే హీరోయిన్లే నయం సామి.. విద్యార్థుల పోరాటానికి మద్దతు
NEET Exam Scam: నీట్ అక్రమాలపై ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు బాలీవుడ్ నటి ప్రీతి జింటా పూర్తి మద్దతు తెలిపారు.
NEET Exam Scam: హీరోలకంటే హీరోయిన్లే నయం సామి.. విద్యార్థుల పోరాటానికి మద్దతు
Preity Zinta: భారతదేశ విద్యా వ్యవస్థను కుదిపేస్తున్న నీట్ పరీక్షల అక్రమాలపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 20 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్కు, దేశ భవిష్యత్తు కోసం రోడ్డెక్కిన విద్యార్థులకు మద్దతుగా బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా గళమెత్తారు. సమాజంలో మార్పు కోసం పోరాడుతున్న విద్యార్థుల పక్షాన నిలబడిన ప్రీతి జింటా, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రీతి జింటా, కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులు, వాంగ్‌చుక్‌లతో అర్థవంతమైన చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం మరింత క్షీణించకముందే కేంద్ర ప్రభుత్వం విద్యార్థి సంఘాలతో వెంటనే చర్చలు ప్రారంభించాలి. అలాగే వాంగ్‌చుక్... దయచేసి మీ నిరాహార దీక్షను విరమించండి. మీరు చేస్తున్న పోరాటం దేశానికి ఎంత ముఖ్యమో, మీ ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. భారతదేశ భవిష్యత్తు కోసం, మన యువత కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికి నా పూర్తి అండ ఉంటుంది అని ప్రీతి జింటా తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనల్లో భాగముగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే విద్యార్థులు చేపట్టిన చలో సంసద్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. న్యాయం కోసం శాంతియుతంగా ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం తీవ్ర కలకలం రేపింది. నీట్ అక్రమాలపై సమగ్ర, పారదర్శక విచారణ జరిపించాలని, అలాగే బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై సినీ పరిశ్రమ నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. సీనియర్ నటి షబానా అజ్మీ, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు చేరుకుని ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మరోవైపు సోనాక్షి సిన్హా, సోనూ సూద్, అదితి రావ్ హైదరీ, భూమి పెడ్నేకర్, దియా మీర్జా, స్టాండప్ కమెడియన్ వీర్ దాస్, మలయాళ స్టార్ టోవినో థామస్ వంటి ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా విద్యార్థుల డిమాండ్లకు మద్దతు పలికారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ నీట్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.




