PM Modi: సుపరిపాలనకు మొబైల్ కనెక్టివిటీనే కీలక శక్తి

PM Modi: దిల్లీలో ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సుపరిపాలన అందించడంలో మొబైల్ కనెక్టివిటీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2026 12:20 PM IST
PM Modi
X

PM Modi: సుపరిపాలనకు మొబైల్ కనెక్టివిటీనే కీలక శక్తి

PM Modi: భారత టెలికాం రంగం కేవలం నెట్‌వర్క్‌లు, స్పెక్ట్రమ్, ఇంటర్నెట్ వేగానికే పరిమితం కాలేదని.. సుపరిపాలన, ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడంలో మొబైల్ కనెక్టివిటీ ఒక అత్యంత కీలక శక్తిగా ఆవిర్భవించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైన 10వ 'ఇండియా మొబైల్ కాంగ్రెస్' (IMC) 2026 సదస్సును ప్రారంభించి ఆయన కీలక ప్రసంగం చేశారు.

గత దశాబ్ద కాలంలో మొబైల్ ఫోన్లు సాధారణ కమ్యూనికేషన్ పరికరాల స్థాయి నుంచి, సుపరిపాలనను ప్రజల ముఖద్వారానికి చేరవేసే ముఖ్యమైన సాధనాలుగా రూపాంతరం చెందాయని ప్రధాని అన్నారు.

"2022లో ఇదే వేదికపై దేశంలో 5జీ సేవలను ప్రారంభించాం. ప్రస్తుతం దేశంలోని ప్రతి జిల్లాకు 5జీ కనెక్టివిటీ చేరింది. దేశంలో 5.5 లక్షలకు పైగా 5జీ బేస్ స్టేషన్లు పనిచేస్తున్నాయి. 2022తో పోలిస్తే మొబైల్ ఇంటర్నెట్ వేగం ఏకంగా 10 రెట్లు పెరిగింది" అని ఆయన వివరించారు.

దశాబ్దం క్రితం సాంకేతికత కొందరికే పరిమితమయ్యేదని, ఆ 'డిజిటల్ విభజన'ను అధిగమించేందుకే 'డిజిటల్ ఇండియా' తెచ్చి ప్రతి ఒక్కరికీ డిజిటల్ సేవలను చేరువ చేశామని మోదీ గుర్తుచేశారు.

కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు స్తంభించిపోయినా.. భారత్‌లో మాత్రం బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల వల్లే బ్యాంకులు, విద్యా సంస్థలు, ఆఫీసులు నిరంతరాయంగా పనిచేశాయని ప్రశంసించారు.

ఈ ఏడాది ఐఎంసీ థీమ్ 'సరిహద్దులు లేని విస్తరణ' (Scale Without Boundaries) గా నిర్ణయించారు. అక్టోబర్ 7 నుంచి 10 వరకు జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును టెలికమ్యూనికేషన్స్ విభాగం, సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకకు దేశ, విదేశీ టెలికాం దిగ్గజాలు, పరిశ్రమల అధిపతులు, స్టార్టప్ ప్రతినిధులు హాజరయ్యారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.