Rahul Gandhi : రాహుల్‌కు పెళ్లి చేసుకోమని చెప్పండి.. ప్రియాంక గాంధీ సరదా ఫోన్ కాల్ వైరల్..!
Rahul Gandhi : ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల నుంచి ఒక సాదాసీదా రోజువారీ కూలీ గొంతు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని ఎవరూ ఊహించలేదు. కాక్రోచ్ జనతా..
Rahul-Gandhi
Rahul Gandhi : ఢిల్లీలోని జంతర్ మంతర్ వీధుల నుంచి ఒక సాదాసీదా రోజువారీ కూలీ గొంతు దేశవ్యాప్తంగా మారుమోగుతుందని ఎవరూ ఊహించలేదు. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమంలో తన ఆసక్తికర వ్యాఖ్యలు, సమాజం పట్ల ఉన్న అవగాహనతో ఒక్కసారిగా సోషల్ మీడియా సంచలనంగా మారారు మహమ్మద్ ఇర్ఫాన్. ఆయన మాట తీరు, విశ్లేషణకు నెటిజన్లు ఫిదా అవ్వడమే కాకుండా, ఏకంగా దేశ రాజకీయ నాయకుల దృష్టి కూడా ఆయనపై పడింది. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఇర్ఫాన్ నివాసానికి వెళ్లి కలవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే, ఆ భేటీకి ముందే జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను ఇర్ఫాన్ ఇటీవల పంచుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తనకు ఫోన్ చేసి మాట్లాడిన తీరు, అందులో చోటుచేసుకున్న సరదా క్షణాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
నా మాట వినడు.. మీరైనా ఒప్పించండి
ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ ఈ సంభాషణ వివరాలను ఎంతో ఆనందంగా వెల్లడించారు. ఢిల్లీలోని సావ్దా జేజే కాలనీలో ఉన్న తన చిన్న నివాసానికి రాహుల్ గాంధీ రాకముందే ప్రియాంక గాంధీ తనకు స్వయంగా ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ సంభాషణ అత్యంత ఆత్మీయంగా, సరదాగా సాగిందని తెలిపారు. మాట్లాడే క్రమంలో ప్రియాంక నవ్వుతూ.. "మా అన్నయ్య నా మాట ఎలాగూ వినడు, కాబట్టి రాహుల్ గాంధీని ఎలాగైనా పెళ్లి చేసుకోమని మీరైనా ఒప్పించండి" అని ఇర్ఫాన్‌ను సరదాగా కోరారు. దానికి ఇర్ఫాన్ కూడా అంతే చమత్కారంగా స్పందిస్తూ.. "రాహుల్ గాంధీ గారు పెళ్లి చేసుకోకుండా దేశం కోసమే ఉండాలని నేను భావిస్తున్నాను" అని ప్రియాంకతో చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.
పుస్తక జ్ఞానం లేకున్నా.. గూగుల్, యూట్యూబ్‌తో రాజ్యాంగ పాఠాలు
సుమారు 35 ఏళ్ల వయస్సున్న మహమ్మద్ ఇర్ఫాన్ జీవనోపాధి కోసం ఐస్ ఆస్క్రీమ్స్ అమ్ముకుంటూ, సావ్దా జేజే కాలనీలోని ఒక అరకొరగా నిర్మించిన చిన్న ఇంట్లో జీవిస్తున్నారు. ఆయనకు పెద్దగా లాంఛనప్రాయ చదువు లేదు; కేవలం అంగన్వాడీ స్థాయి వరకే వెళ్లడంతో చదవడం, రాయడం కూడా సరిగ్గా రాదు. కానీ సమాజం పట్ల, దేశ పరిస్థితుల పట్ల ఆయనకున్న అవగాహన మాత్రం అపారం. చదువు రాకపోయినా గూగుల్ వాయిస్ సెర్చ్, యూట్యూబ్ వీడియోల సహాయంతో రాజ్యాంగం, ప్రజాస్వామిక సూత్రాలు, హక్కులు , కార్మిక చట్టాల గురించి స్వయంగా తెలుసుకున్నారు. జంతర్ మంతర్ నిరసన వద్ద జర్నలిస్ట్ రజత్ పాండేతో ఇర్ఫాన్ జరిపిన సంభాషణ వీడియో ఆన్లైన్లో విపరీతంగా వైరల్ కావడంతో, ఆయనకున్న పరిజ్ఞానాన్ని చూసి దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకులు ముగ్ధులయ్యారు.
ఇంటికి వచ్చిన రాహుల్ గాంధీ.. పార్లమెంట్‌కు ఆత్మీయ ఆహ్వానం
ఇర్ఫాన్ ఇంటర్వ్యూ వైరల్ అయిన కొద్ది రోజులకే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నేరుగా ఆయన నివాసానికి వెళ్లడం విశేషం. ఏలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఇర్ఫాన్ ఇంట్లో కూర్చుని, అక్కడ లభించిన సాధారణ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ రాహుల్ ఆయనతో సుదీర్ఘంగా ముచ్చటించారు. ఈ భేటీ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువలు, సాధారణ కార్మికుల హక్కులు , గౌరవప్రదమైన జీవనోపాధి ప్రాముఖ్యతపై ఇర్ఫాన్ తన స్పష్టమైన అభిప్రాయాలను రాహుల్ ముందుంచారు. ఇర్ఫాన్ ఆలోచనా దృక్పథాన్ని, విశ్లేషణను మెచ్చుకున్న రాహుల్ గాంధీ, ఆయనను , ఆయన కుటుంబాన్ని పార్లమెంటును సందర్శించాల్సిందిగా ప్రత్యేకంగా ఆహ్వానించారు.
ప్రచారం కోసం కాదు.. నిరుపేదల గొంతుకగా
తాను కేవలం ప్రచారం కోసమో లేదా వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనో నిరసనల్లో పాల్గొనలేదని ఇర్ఫాన్ పదేపదే స్పష్టం చేశారు. రోజువారీ కూలీలు, అసంఘటిత రంగంలో నలిగిపోతున్న పేద కార్మికుల కష్టాలను, వారి సమస్యలను పాలకులకు వినిపించేందుకే తాను సీజేపీ ఆందోళనలో భాగమయ్యానని చెప్పారు. రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు కూడా తన కుటుంబం కోసం ఎలాంటి వ్యక్తిగత ప్రయోజనాలు లేదా డిమాండ్లు కోరలేదని తెలిపారు. దేశంలో ఆర్థికంగా బలహీనవర్గాలు, కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లపై నిరంతరం గొంతు విప్పాలని, వారి సంక్షేమం కోసం పోరాడాలని మాత్రమే కాంగ్రెస్ నాయకుడిని కోరినట్లు ఇర్ఫాన్ వెల్లడించారు.




