Parliament Sessions : ఎగ్జామ్ మాఫియాకు షాక్.. కొత్త బిల్లు వస్తోంది.!

Parliament Sessions : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలు, పేపర్

G Krishna
Published on: 27 July 2026 11:31 AM IST
Parliament-Session
X

Parliament-Session

Parliament Sessions : దేశవ్యాప్తంగా కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు ఉద్దేశించిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు, 2026'ను లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా సాగిన భారీ ఆందోళనల నడుమ వస్తున్న ఈ బిల్లుపై సుమారు 8 నుంచి 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.. 2 నెలల్లోనే విచారణ పూర్తి

ఈ కొత్త సవరణ బిల్లులో ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. పేపర్ లీకేజీ కేసులను మాత్రమే విచారించేందుకు ప్రతీ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేకాకుండా, ఈ కేసులకు సంబంధించిన విచారణను కేవలం రెండు నెలల గడువులోనే పూర్తి చేయాలని నిర్దేశించారు. దీనివల్ల నిందితులకు త్వరితగతిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది.

పదేళ్ల జైలు శిక్ష.. కోట్లల్లో జరిమానా

పేపర్ లీక్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపేలా శిక్షల తీవ్రతను భారీగా పెంచారు. వ్యక్తిగతంగా పేపర్ లీకేజీకి పాల్పడినట్లు రుజువైతే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల వరకు జరిమానా విధించనున్నారు. ఇక ముఠాగా ఏర్పడి నెట్‌వర్క్ నడిపే ఆర్గనైజ్డ్ లీకేజీ సిండికేట్లకు ఏకంగా రూ. 10 కోట్ల వరకు భారీ పెనాల్టీ విధించేలా కఠిన నిబంధనలు చేర్చారు.

యంగ్ ఎంపీలతో ఎన్డీయే వ్యూహం.. పార్లమెంట్‌లో హీటెక్కనున్న చర్చ

ఈ కీలక బిల్లుపై పార్లమెంట్‌లో జరిగే చర్చను నడిపించేందుకు ఎన్డీయే కూటమి తన యువ ఎంపీలను ముందువరుసలో నిలిపింది. బాన్సురీ స్వరాజ్, తేజస్వి సూర్య ఈ చర్చను లీడ్ చేయనుండగా.. టీడీపీ నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, జేడీయూ నుంచి రాజీవ్ రంజన్ సింగ్, శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, ఎన్సీపీ నుంచి సునీల్ తట్కరే, అప్నా దళ్ నుంచి అనుప్రియ పటేల్, ఎల్‌జేపీ నుంచి అరుణ్ భారతి ప్రసంగించనున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్, మిటాలి బాగ్ చర్చలో పాల్గొననున్నారు.

కొత్త విద్యాశాఖ మంత్రికి తొలి పరీక్ష

నీట్ లీకేజ్ వివాదం ముదరడంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషికి లోక్‌సభలో మొదటి 'ప్రశ్నోత్తరాల సమయం' ఎదురుకానుంది. విద్యాశాఖకు సంబంధించిన పలు ప్రశ్నలకు ఆయన సభలో సమాధానాలు ఇవ్వనున్నారు

36 రోజుల పోరాటానికి లభించిన ఫలితం

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ప్రదర్శనలు.. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ మద్దతు తెలిపిన తర్వాత మరింత ఉధృతమయ్యాయి. విద్యార్థుల పార్లమెంట్ మార్చ్‌పై పోలీసులు బలప్రయోగం చేశారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఎట్టకేలకు ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా సహా పలు కీలక డిమాండ్లను అంగీకరించడంతో సుదీర్ఘ పోరాటానికి తెరపడింది. ఈ నేపథ్యములోనే కేంద్ర ప్రభుత్వం ఈ కఠినమైన చట్టాన్ని అమల్లోకి తెచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story