పుణె బిజినెస్‌మ్యాన్ లోయ మృతి కేసులో సంచలన ట్విస్ట్: ప్రమాదం కాదు.. కాబోయే భార్యే చంపేసింది!

Pune: పుణె లోహగఢ్‌ కోట లోయలో పడి వ్యాపారవేత్త కేతన్‌ అగర్వాల్‌ మృతిచెందిన ఘటన హత్యాచారంగా మారింది.

Arun Chilukuri
Published on: 23 Jun 2026 2:58 PM IST
pune
X

పుణె బిజినెస్‌మ్యాన్ లోయ మృతి కేసులో సంచలన ట్విస్ట్: ప్రమాదం కాదు.. కాబోయే భార్యే చంపేసింది!

Pune: మహారాష్ట్రలోని పుణె సమీపంలో గల చారిత్రక లోహగఢ్‌ కోట వద్ద కొన్ని రోజుల క్రితం జరిగిన యువ బిజినెస్‌మ్యాన్ కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ (26) అనుమానాస్పద మృతి కేసు అత్యంత కీలక మలుపు తిరిగింది. అది హోరుగాలి వల్ల జరిగిన ప్రమాదం కాదని, ఒక ప్రణాళిక ప్రకారం చేసిన ఘోర హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేతన్‌ను అతడి కాబోయే భార్యే అత్యంత క్రూరంగా లోయలోకి తోసి చంపేసిందని తేలడంతో, పోలీసులు దీనిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్‌ అగర్వాల్ తమ కుటుంబ స్థిరాస్తి (Real Estate) వ్యాపార కంపెనీలో డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జూన్‌ 18న లోహగఢ్‌ కోట వద్ద ఉన్న 400 అడుగుల లోతు లోయలో పడి కేతన్ ప్రాణాలు కోల్పోయాడు. నాటి ఘటనపై కేతన్ కాబోయే భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. "మేము ట్రెక్కింగ్‌కు వచ్చాం. జూన్ 19న నా పుట్టినరోజు ఉండటంతో కేతన్ నన్ను ఫొటోలు తీస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా పెద్ద గాలి రావడంతో పట్టుతప్పి లోయలో పడిపోయాడు" అని నమ్మించింది.

అయితే, విచారణ ముదురుతున్న కొద్దీ సదరు యువతి పొంతన లేని సమాధానాలు చెప్పడం ప్రారంభించింది. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు ఆ కోణంలో లోతుగా దర్యాప్తు చేయగా అసలు ఘోరం బయటపడింది.

ఈ దారుణానికి సంబంధించి కేతన్ కాబోయే భార్యను, ఆమెకు సహకరించిన ఒక పురుష మిత్రుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి ఇష్టం లేకో లేదా మరేదైనా వివాదమో కానీ.. సదరు యువతి తన మిత్రుడితో కలిసి పథకం ప్రకారమే కేతన్‌ను లోయలోకి తోసేసి, ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘాతుకంలో ప్రమేయం ఉందనే అనుమానంతో మరో ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కేతన్ అగర్వాల్‌కు ఇటీవలే సదరు యువతితో వివాహం నిశ్చయమైంది. నవంబరులో జరగబోయే గ్రాండ్ వెడ్డింగ్ వేడుక కోసం రాజస్థాన్‌ ఉదయ్‌పుర్‌లోని ఒక అత్యంత ఖరీదైన ప్యాలెస్‌ను కూడా కుటుంబ సభ్యులు బుక్‌ చేశారు. అంతా సంతోషంగా సాగుతుందనుకున్న తరుణంలో, కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం కొంతమంది మిత్రులతో కలిసి వెళ్లిన కేతన్.. ఇలా శవమై తిరిగిరావడం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story