Pune: పుణేలో ఘోరం.. కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం!
Pune: మహారాష్ట్రలోని పుణేలో ఘోరం జరిగింది. కదులుతున్న కారులో తనపై అత్యాచారం జరిగిందంటూ పాట్నాకు చెందిన మహిళా లాయర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Pune: పుణేలో ఘోరం.. కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం!
Pune: మహారాష్ట్రలోని ఐటీ హబ్ పుణే నగరంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. నగరంలో శాంతిభద్రతలపై ఆందోళన రేకెత్తిస్తూ.. కదులుతున్న కారులో ఓ మహిళా న్యాయవాది (లాయర్) పై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుతో వేగంగా స్పందించిన పుణే పోలీసులు కారు నెంబర్ ఆధారంగా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాజధాని పాట్నాకు చెందిన ఓ మహిళా లాయర్ వృత్తిపరమైన పని మీద ఆదివారం పుణేకు వచ్చారు. నగరంలోని ఒక ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఆమె బస చేశారు. రాత్రి సమయంలో ఆ హోటల్‌లోని పబ్‌లో ఆమె మద్యం తాగుతుండగా, పక్కనే ఉన్న ఇద్దరు వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. కాసేపటి తర్వాత వారంతా కలిసి మరో పబ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో వారితో కలిసి సదరు మహిళా లాయర్ కారులో బయలుదేరారు. కారు కదులుతుండగానే వారిలో ఒక వ్యక్తి ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా వారు ఫోన్ చేసి మరో ఇద్దరు స్నేహితులను కూడా అక్కడికి రప్పించారు. కారులోకి వచ్చిన ఆ ఇద్దరు కూడా మహిళా లాయర్‌ను తీవ్రంగా లైంగిక వేధింపులకు గురిచేశారు.
ఈ ఘోర పరాభవం నుంచి ఎలాగోలా బయటపడిన బాధితురాలు నేరుగా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం, కారు నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిని అభిషేక్ నవనాథ్ ముక్తే, ధనుంజయ్ సోర్టే, ఆదేశ్ శిందేలుగా పోలీసులు గుర్తించారు. వీరిపై అత్యాచారం, లైంగిక వేధింపుల కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో భాగస్వామిగా ఉన్న నాలుగో నిందితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. ఫైవ్‌స్టార్ హోటల్, పబ్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.




