Private Schools: ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం షాక్.. పెంచిన ఫీజులు వెనక్కి ఇవ్వాల్సిందే!
Private Schools: ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై పంజాబ్ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది.
Private Schools: ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం షాక్.. పెంచిన ఫీజులు వెనక్కి ఇవ్వాల్సిందే!
Private Schools: ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసేలా పంజాబ్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత మూడేళ్లుగా వార్షిక ఫీజుల పెంపు పేరిట నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసిన అదనపు మొత్తాన్ని ప్రైవేట్ పాఠశాలలు వెంటనే తిరిగి చెల్లించాలని (రీఫండ్ చేయాలని) పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.
ఈ విప్లవాత్మక నిర్ణయం అమలు కోసం రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గత నాలుగేళ్ల ఫీజు రికార్డులను పది రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ రికార్డుల సమాచారాన్ని పారదర్శకత కోసం విద్యాశాఖ అధికారిక పోర్టల్‌లో ఉంచి ప్రజలందరికీ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించారు.
ఇటీవల అమృత్‌సర్‌లో స్కూల్ ఫీజు చెల్లించలేదనే కారణంతో పాఠశాల యాజమాన్యం చేసిన మానసిక వేధింపుల తట్టుకోలేక 17 ఏళ్ల విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన అత్యంత పీడాకరమైన ఘటనను ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
"ఈ హృదయ విదారక ఘటన తర్వాత, ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల నుంచి వెల్లువెత్తిన వేలాది ఫిర్యాదులను పరిశీలించాం. అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నాం. ఒకవేళ ప్రైవేట్ యాజమాన్యాలు ఈ ఆర్డినెన్స్‌ను కోర్టులో సవాలు చేసినా.. మేము చట్టపరంగా పోరాడతాం కానీ, ఈ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు" అని సీఎం భగవంత్ మాన్ తేల్చి చెప్పారు.
నూతన ఆర్డినెన్స్ ప్రకారం ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల నియంత్రణకు కఠినమైన నిబంధనలను పొందుపరిచింది. ఏ ప్రైవేట్ పాఠశాల కూడా తమ వార్షిక ఫీజులను ఏటా 5 శాతానికి మించి పెంచడానికి వీల్లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘించే పాఠశాలలపై రూ. 50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు జరిమానా విధించడంతో పాటు, అవసరమైతే ఆయా స్కూళ్ల గుర్తింపును పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ విప్లవాత్మక నిర్ణయం ద్వారా పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భారీ ఆర్థిక ఉపశమనం లభించనుందని అంచనా వేస్తున్నారు.




