Rail Roko : అన్నదాత ఆగ్రహం.. పంజాబ్ లో నిలిచిపోనున్న రైళ్లు.. 3 గంటల పాటు చక్రా బంద్
Rail Roko : పంజాబ్ రాష్ట్రంలో రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. గోధుమల కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నేడు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకో ఆందోళన చేపట్టారు.
Rail Roko
Rail Roko : పంజాబ్ రాష్ట్రంలో రైతులు మరోసారి ఉద్యమబాట పట్టారు. గోధుమల కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నేడు (శుక్రవారం) రాష్ట్రవ్యాప్తంగా రైలు రోకో ఆందోళన చేపట్టారు. ఆజాద్ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు రైలు పట్టాలపై బైఠాయించి నిరసన తెలపనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు గోధుమల సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, దీనివల్ల వేలాది క్వింటాళ్ల ధాన్యం మండీల్లోనే కుళ్ళిపోతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు.. రైతుల కన్నీళ్లు
పంజాబ్ వ్యాప్తంగా ప్రస్తుతం గోధుమ కోతలు పూర్తయ్యాయి. అయితే, మండీలకు చేరిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు జాప్యం చేస్తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరిలో పెరిగిన ఉష్ణోగ్రతలు, మార్చి-ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా గోధుమ గింజ రంగు మారిందని, నాణ్యత తగ్గిందని సాకు చూపి ఎఫ్‌సీఐ కొనుగోలుకు నిరాకరిస్తోంది. దీంతో వేలాది మంది రైతులు మండీల్లోనే నిరీక్షిస్తూ ఆర్థికంగా, మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
ఎఫ్‌సీఐ నిబంధనలే ప్రధాన అడ్డంకి
సాధారణంగా భారతీయ ఆహార సంస్థ గోధుమలను కొనుగోలు చేసేటప్పుడు గింజలో తేమ శాతం, రంగు, నాణ్యతను నిశితంగా పరిశీలిస్తుంది. కానీ ఈసారి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతిన్నందున, ఈ కఠిన నిబంధనలను సడలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నేడు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు కీలక రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించాలని ఆజాద్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.
మంత్రి రవనీత్ బిట్టూ కీలక ప్రకటన
రైతుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ రంగంలోకి దిగారు. పంజాబ్ రైతులకు ఊరటనిచ్చేలా ఎఫ్‌సీఐ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ఆయన ప్రకటించారు. అకాల వర్షాల వల్ల రంగు మారిన గోధుమలను కూడా కొనుగోలు చేసేలా మార్గదర్శకాలు మారుస్తున్నామని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం సేకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఈ ప్రకటనపై రైతు సంఘాలు ఇంకా సంతృప్తి వ్యక్తం చేయలేదు.
ముందుకు సాగనున్న రైలు రోకో
మంత్రి ప్రకటన వెలువడినప్పటికీ, తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు లేదా క్షేత్రస్థాయిలో కొనుగోళ్లు ప్రారంభమయ్యే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతు నేతలు స్పష్టం చేస్తున్నారు. దీంతో నేడు పంజాబ్ మీదుగా ప్రయాణించే అనేక రైళ్లు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి మండీల్లో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.




