Lottery Ticket: అదృష్టమంటే ఇదేనా? సాయంత్రం రూ.7 పెట్టింది.. పొద్దున్నే రూ.కోటి కొట్టేసింది
Lottery Ticket: పంజాబ్ ఫరీద్‌కోట్‌కు చెందిన బిమలా దేవి అనే నిరుపేద మహిళ రూ.7 పెట్టి సిక్కిం స్టేట్ లాటరీ టికెట్ కొనుగోలు చేసింది.
Punjab Lottery Winner
Lottery Ticket: జీవితంలో ఎవరి అదృష్టం ఏ క్షణంలో ఎలా తిరుగుతుందో ఎవరూ ఊహించలేరు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాల్లోకి ఒక్కోసారి అదృష్టం లక్ష్మీదేవిలా నడుచుకుంటూ వస్తుంది. సరిగ్గా ఇలాంటి అద్భుతమే పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. ఫరీద్‌కోట్ జిల్లా పరిధిలోని కోట్‌కపురా ప్రాంతంలో నివసించే బిమలా దేవి అనే నిరుపేద మహిళ సాధారణ దినసరి కూలీ భార్య. ప్రతీరోజూ సంసారాన్ని ఈడ్చడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో, ఆమె కొన్న ఒక చిన్న లాటరీ టికెట్ వారి జీవితాలనే పూర్తిగా మార్చేసింది. కేవలం ఏడు రూపాయలు పెట్టి కొన్న లాటరీ టికెట్‌కు ఏకంగా రూ.కోటి బంపర్ ప్రైజ్ తగలడం ఇప్పుడు ఆ ప్రాంతమంతటా పెద్ద సంచలనంగా మారింది.
రైల్వే రోడ్డులో అనుకోకుండా తీసుకున్న నిర్ణయం
ఒకరోజు సాయంత్రం బిమలా దేవి ఇంటికి కావలసిన వస్తువులు తెచ్చుకోవడానికి స్థానిక రైల్వే రోడ్డు ప్రాంతానికి వెళ్లింది. అక్కడ ఆమెకు చిన్న లాటరీ స్టాల్ కనిపించింది. మనసులో సడన్‌గా చిన్న ఆలోచన రావడం, జేబులో ఉన్న రూ.7లతో సిక్కిం స్టేట్ లాటరీ టికెట్ కొనుగోలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఆ టికెట్‌ను పక్కన పడేసి ఎప్పటిలాగే ఇంటి పనుల్లో మునిగిపోయింది. నిజానికి ఆ టికెట్‌పై ఆమె ఎలాంటి భారీ ఆశలు పెట్టుకోలేదు. కానీ అదృష్టం ఆమె తలుపు తట్టడానికి ఎంతో సమయం పట్టలేదు.
ఫలితాలు చూసి మైండ్ బ్లాక్
మరుసటి రోజు సాయంత్రం లాటరీ నిర్వాహకులు ఫలితాలను విడుదల చేశారు. ఆశ్చర్యకరంగా బిమలా దేవి కొనుగోలు చేసిన టికెట్ నంబర్‌కే రూ.కోటి మొదటి బహుమతి వరించింది. ఈ విషయాన్ని లాటరీ దుకాణదారుడు నరేష్ మోంగా స్వయంగా బిమలా దేవి కుటుంబానికి తెలియజేశాడు. మొదట నమ్మలేకపోయినా, నిజమని తెలిసాక ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. వార్త తెలియగానే కుటుంబ సభ్యులందరూ వెంటనే షాప్ వద్దకు చేరుకుని, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఉత్సాహంగా భాంగ్రా నృత్యాలు చేశారు. తన షాప్ చరిత్రలోనే ఇంత పెద్దమొత్తంలో బహుమతి రావడం ఇదే తొలిసారని దుకాణదారుడు సంతోషం వ్యక్తం చేశాడు.
పిల్లల భవిష్యత్తు, సొంత వ్యాపారమే లక్ష్యం
రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన బిమలా దేవి తన సంతోషాన్ని పంచుకుంటూ భావోద్వేగానికి గురైంది. ఇన్నాళ్లూ తమను వెంటాడిన పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఈ లాటరీ డబ్బుతో పూర్తిగా తొలగిపోతాయని ధీమా వ్యక్తం చేసింది. వచ్చిన డబ్బును అనవసరంగా వృథా చేయకుండా చాలా జాగ్రత్తగా, తెలివిగా ఉపయోగిస్తామని తెలిపింది. ముందుగా తమ పిల్లలకు మంచి చదువు అందించి బంగారు భవిష్యత్తును అందిస్తామని, కుటుంబం స్థిరపడటానికి ఒక చిన్నపాటి వ్యాపారం ప్రారంభిస్తామని చెప్పింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథ
ప్రస్తుతం ఈ వార్తా కథనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కష్టాల్లో ఉన్న నిరుపేద కుటుంబానికి సరైన సమయంలో అదృష్టం కలిసి వచ్చిందని స్థానికులు కొనియాడుతున్నారు. ఏడు రూపాయల చిన్న టికెట్ ఆ నిరుపేద కుటుంబపు కష్టాలను తుడిచిపెట్టడమే కాకుండా, ఊహించని రీతిలో వారి కలలను నెరవేర్చి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.




