పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి, 100 మందికి గాయాలు
పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇద్దరు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Puri Rath Yatra Stampede 2 Dead, Over 100 Injured
పూరీ: ఒడిశాలో అత్యంత వైభవంగా నిర్వహించే పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఇద్దరు భక్తులు మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతుల్లో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్ దాస్గా గుర్తించగా, మరో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనకు సంబంధించి అధికారులు విచారణ ప్రారంభించారు. రథయాత్ర సందర్భంగా భారీగా భక్తులు తరలిరావడంతో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.
ప్రస్తుతం ఘటనాస్థలంలో పోలీసులు, జిల్లా యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూ భక్తులను క్రమబద్ధంగా తరలించే చర్యలు చేపడుతున్నారు.




