రాఘవ్ చద్దాకు 'డిజిటల్' షాక్: 24 గంటల్లో 10 లక్షల మంది అన్‌ఫాలో.. బీజేపీలో చేరడమే శాపమైందా?
Raghav Chadha: ఆప్ నుంచి బీజేపీలోకి మారిన రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో భారీ షాక్ తగిలింది. కేవలం 24 గంటల్లోనే 10 లక్షల మంది అన్‌ఫాలో చేయగా, 'పంజాబ్ గద్దర్' అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తున్నారు.
రాఘవ్ చద్దాకు 'డిజిటల్' షాక్: 24 గంటల్లో 10 లక్షల మంది అన్‌ఫాలో.. బీజేపీలో చేరడమే శాపమైందా?
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి హ్యాండిచ్చి భారతీయ జనతా పార్టీ (BJP) గూటికి చేరిన యువ నేత రాఘవ్ చద్దాకు సోషల్ మీడియాలో ఊహించని షాక్ తగిలింది. పార్టీ మార్పు నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు ఆయనపై 'అన్‌ఫాలో' అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే లక్షలాది మంది ఆయన ఫాలోవర్ల జాబితా నుంచి తప్పుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రికార్డు స్థాయిలో తగ్గిన ఫాలోవర్లు:
రాఘవ్ చద్దా బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వేదికల్లో ఆయన గ్రాఫ్ అట్టడుగుకు పడిపోయింది. నివేదికల ప్రకారం, ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య 1.46 కోట్ల (14.6 మిలియన్లు) నుండి 1.37 కోట్లకు పడిపోయింది. కేవలం 24 గంటల్లోనే దాదాపు 10 లక్షల మంది ఆయనను అన్‌ఫాలో చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 80 వేలకు పైగా ప్రతికూల కామెంట్లు రాగా, ఫేస్‌బుక్‌లో వేల సంఖ్యలో యూజర్లు ఆయనను విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.
సోషల్ మీడియాలో #UnfollowRaghavChadha అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆయనను "హీరో టు జీరో", "పంజాబ్ గద్దర్" (ద్రోహి) అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. కేజ్రీవాల్‌కు కష్టకాలంలో తోడుండాల్సింది పోయి, పథకం ప్రకారం మరో ఆరుగురు ఎంపీలతో కలిసి పార్టీ మారడంపై ఆప్ అభిమానులు మండిపడుతున్నారు.
రాఘవ్ చద్దాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిత్తల్ వంటి కీలక నేతలు కూడా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆప్ రాజ్యసభ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది బీజేపీలో చేరుతున్నట్లు చద్దా ప్రకటించినప్పటికీ, సామాన్య ప్రజల్లో మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకప్పుడు ప్రజల గొంతుకగా పేరు తెచ్చుకున్న చద్దా, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోవాల్సి వస్తోంది.




