Raghav Chadha: ఓటరు జాబితా నుంచి ఎంపీ రాఘవ్‌ చడ్ఢా పేరు తొలగింపు.. రాజకీయ కక్షసాధింపేనని మండిపాటు

Raghav Chadha: పంజాబ్ ఓటరు జాబితా నుంచి ఎంపీ రాఘవ్ చడ్ఢా పేరు తొలగింపుపై రాజకీయ వివాదం.

Arun Chilukuri
Published on: 3 Sept 2026 1:15 PM IST
Raghav Chadha
X

Raghav Chadha: ఓటరు జాబితా నుంచి ఎంపీ రాఘవ్‌ చడ్ఢా పేరు తొలగింపు.. రాజకీయ కక్షసాధింపేనని మండిపాటు

Raghav Chadha: పంజాబ్‌లో చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఆ రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్ఢా పేరు ఓటరు జాబితా నుంచి తొలగించబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మొహాలీ ఓటరు జాబితాలో తన పేరును శాశ్వతంగా వలస వెళ్లిన వారిగా పేర్కొంటూ తొలగించడంపై రాఘవ్ చడ్ఢా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఎక్స్‌లో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

తాను పంజాబ్ నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడినని గుర్తుచేసిన చడ్ఢా, ఎంపీలు మరియు ఎమ్మెల్యేల కోసం ఎస్ఐఆర్ (SIR) మార్గదర్శకాల్లో ప్రత్యేక నిబంధనలు ఉన్నప్పటికీ పంజాబ్ అధికారులు వాటిని స్పష్టంగా ఉల్లంఘించారని ఆరోపించారు. ఇది కేవలం సాధారణ పొరపాటు కాదని, తనపై రాజకీయ కక్షలో భాగంగానే కావాలని ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన దుయ్యబట్టారు. అయితే ఇది కేవలం ముసాయిదా జాబితా మాత్రమేనని, దీనిపై తాను తగిన అభ్యంతరాలను అధికారికంగా తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు రాఘవ్ చడ్ఢా చేసిన ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్రంగా ఖండించింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నిబంధనలు మరియు ఆధ్వర్యంలోనే పారదర్శకంగా జరుగుతోందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యం లేదా పాత్ర ఏమాత్రం లేదని స్పష్టం చేసింది. కాగా, పంజాబ్‌లో తాజాగా విడుదలైన ఎస్ఐఆర్ ముసాయిదా జాబితాలో సుమారు 20.66 లక్షల మంది పేర్లను వివిధ కారణాలతో ఓటరు లిస్ట్ నుంచి తొలగించడం ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story