Raghav Chadha: భయంతో కాదు.. కేజ్రీవాల్ అవినీతి వల్లే బయటకు వచ్చాం

Raghav Chadha: ఆప్ నుంచి బీజేపీలోకి మారడంపై రాఘవ్ చడ్ఢా మరోసారి స్పందించారు. కేజ్రీవాల్‌ 'శీష్ మహల్' అవినీతి, పార్టీలో పెరిగిన నిరాశ వల్లే బయటకు వచ్చామని, భయంతో కాదని స్పష్టం చేశారు. ఆప్ ఇప్పుడు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆయన ఆరోపించారు.

Arun Chilukuri
Published on: 25 April 2026 5:51 PM IST
Raghav Chadha
X

Raghav Chadha: భయంతో కాదు.. కేజ్రీవాల్ అవినీతి వల్లే బయటకు వచ్చాం

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్న రాఘవ్ చడ్ఢా, తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టారు. తాము భయంతో పార్టీని వీడామన్న ప్రచారాన్ని కొట్టిపారేసిన ఆయన, అరవింద్ కేజ్రీవాల్ విధానాలు మరియు పార్టీలో పెరిగిన అవినీతి వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

మీడియాతో మాట్లాడిన రాఘవ్ చడ్ఢా, పార్టీ ఇప్పుడు సరైన మార్గంలో పయనించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "భయం వల్ల మేము పార్టీని వీడలేదు. అక్కడ నెలకొన్న నిరాశ, నిస్పృహ, అసహ్యం వల్లే బయటకు వచ్చాం. అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు ఆప్‌లో ఉండటానికి ఇష్టపడటం లేదు. అవినీతిపరులు, రాజీపడిన వ్యక్తుల చేతుల్లోకి పార్టీ వెళ్లిపోయింది" అని ఆయన ఆరోపించారు.

కేజ్రీవాల్ అధికార నివాసం 'శీష్ మహల్' (అద్దాల మేడ) కారణంగానే ఆమ్ ఆద్మీ ప్రతిష్ఠ మంటగలిసిందని రాఘవ్ చడ్ఢా విమర్శించారు."దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం ఈ శీష్ మహల్ వివాదమే.""ఎన్నికలు జరిగి ఏడాది కూడా కాకముందే 'శీష్ మహల్ పార్ట్-2' వచ్చేసింది. కేజ్రీవాల్ ఇప్పుడు ప్రజాప్రయోజనాల కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు."

తాను ఆ పార్టీలో ఉన్న సమయంలో సరైన చోట ఉన్నాననే భావన కలగలేదని చడ్ఢా పేర్కొన్నారు. "వారి నేరాల్లో నేను భాగం కావాలని అనుకోవడం లేదు. అందుకే దేశం కోసం పనిచేసే సరైన వేదికను ఎంచుకున్నాను" అని బీజేపీలో చేరడాన్ని ఆయన సమర్థించుకున్నారు. చద్దాతో పాటు మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కూడా ఒకే అభిప్రాయంతో ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story