Raghav Chadha: నది లాంటి వాడిని.. వరదలా విరుచుకుపడతా: రాఘవ్ చడ్డా వార్నింగ్!
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీలో ముదిరిన ముఠా రాజకీయం! రాజ్యసభ ఉపనేత పదవి నుంచి తొలగించడంపై రాఘవ్ చడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Raghav Chadha: నది లాంటి వాడిని.. వరదలా విరుచుకుపడతా: రాఘవ్ చడ్డా వార్నింగ్!
Raghav Chadha vs AAP: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. రాజ్యసభలో పార్టీ ఉపనేత పదవి నుంచి తనను తొలగించడంపై యువ ఎంపీ రాఘవ్ చడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఆయన గురువారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, అధిష్ఠానాన్ని సూటిగా ప్రశ్నించారు.
ప్రజా సమస్యలు లేవనెత్తడం నేరమా?
"పార్లమెంట్లో నాకు లభించిన ప్రతి అవకాశాన్ని ప్రజా సమస్యల కోసమే వినియోగించాను. ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధరల బాదుడు, గిగ్ వర్కర్ల ఇబ్బందులు, టోల్ ప్లాజా దోపిడీ వంటి అంశాలపై గళమెత్తాను. ఇవన్నీ పార్టీకి మైలేజీ ఇచ్చేవే కదా! ప్రజల పక్షాన నిలబడటం ఏమైనా నేరమా? నేనేం తప్పు చేశాను?" అని చడ్డా భావోద్వేగానికి లోనయ్యారు. తన గళాన్ని నొక్కేయాలని చూస్తున్నారని, తనను మాట్లాడకుండా చేయాలని స్వయంగా పార్టీయే రాజ్యసభ సెక్రటరీకి లేఖ రాయడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
వరదలా విరుచుకుపడతా..
పార్టీ నిర్ణయంపై స్పందిస్తూ చడ్డా హెచ్చరిక స్వరూపాన్ని ప్రదర్శించారు. "నన్ను పదవుల నుంచి తొలగించి నా గళాన్ని అణచివేయగలరేమో కానీ, నన్ను ఓడించలేరు. నేను నది లాంటి వాడిని.. సమయం వచ్చినప్పుడు వరదలా విరుచుకుపడతాను" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తన పక్షాన ఉన్నారని, వారి కోసం పోరాటం ఆపబోనని స్పష్టం చేశారు.
అశోక్ మిత్తల్‌కు బాధ్యతలు - చడ్డాపై వేటుకు కారణమిదేనా?
రాఘవ్ చడ్డాను తొలగించిన ఆప్ నాయకత్వం, ఆయన స్థానంలో ఎంపీ అశోక్ మిత్తల్‌ను డిప్యూటీ లీడర్‌గా నియమించింది. గత కొంతకాలంగా చడ్డా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, పార్టీ స్టాండ్‌పై స్పందించడం లేదని ఆరోపిస్తూ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఆయన త్వరలోనే బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడం దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.




