Raghava Lawrence: త్రిష కాదు లారెన్స్.. తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రకటనకు కౌంట్‌డౌన్
Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం.
Raghava Lawrence: త్రిష కాదు లారెన్స్.. తమిళనాడు రాజకీయాల్లో కీలక ప్రకటనకు కౌంట్‌డౌన్
Raghava Lawrence: కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడు, దర్శకుడు, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది. తాజాగా ఆయన చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికతో మొదలైన ఊహాగానాలు
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఒక స్థానాన్ని కొనసాగిస్తూ మరో స్థానానికి రాజీనామా చేయడంతో తిరుచ్చి ఈస్ట్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా ఈ స్థానంలో త్రిష పోటీ చేస్తారంటూ చర్చ జరిగింది.అయితే ఆ తర్వాత ఇవి కేలం పుకార్లు మాత్రమే అని తేలాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ స్థానం నుంచి టీవీకే పార్టీ తరఫున రాఘవ లారెన్స్ బరిలోకి దిగనున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
'జూన్ 11న కీలక విషయం చెబుతా'.. లారెన్స్ పోస్ట్ వైరల్
తన పేరు చుట్టూ జరుగుతున్న ప్రచారంపై లారెన్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను "బెంజ్" సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని, షూటింగ్ షెడ్యూల్ పూర్తైన తర్వాత తన జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. తల్లి ఆశీస్సులతో జూన్ 11 ఉదయం 9:30 గంటలకు ఆ ప్రకటన ఉంటుందని ఆయన వెల్లడించారు. అయితే ఆ ప్రకటన రాజకీయాలకు సంబంధించినదేనా? లేక మరే ఇతర అంశమా? అన్నది స్పష్టత రాలేదు. దీంతో అభిమానులు, రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
సామాజిక సేవతో ప్రత్యేక గుర్తింపు..
సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా లారెన్స్ ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. అనాథలు, వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వారికి తన వంతు సహాయం చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సహాయం కోరిన వారికి కూడా స్పందిస్తూ తన సేవా సంస్థ ద్వారా మద్దతు అందిస్తుంటారు.
ఇలాంటి ప్రజాదరణ, సేవా కార్యక్రమాల నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచి ప్రభావం చూపగలరని పలువురు భావిస్తున్నారు. మరోవైపు విజయ్‌తో లారెన్స్‌కు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో విజయ్ నటించిన పలు చిత్రాలకు లారెన్స్ కొరియోగ్రఫీ కూడా చేశారు. ఈ అనుబంధం కారణంగానే టీవీకే తరఫున ఆయనకు అవకాశం దక్కవచ్చన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం అన్ని ఊహాగానాలకు తెరపడాలంటే లారెన్స్ ప్రకటించబోయే ఆ కీలక నిర్ణయం కోసం వేచి చూడాల్సిందే. జూన్ 11న ఆయన చెప్పబోయే విషయం రాజకీయ రంగప్రవేశానికి సంబంధించినదేనా అనే ప్రశ్నకు అప్పుడే సమాధానం లభించనుంది.




