బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు.. అర్ధనారీశ్వర శిల్పంతో పోస్ట్
Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్‌పై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు.. అర్ధనారీశ్వర శిల్పంతో పోస్ట్
Rahul Gandhi: బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆదివారం సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాటిని సంస్కారహీనమైనవి, అత్యాశ కలిగినవి, కులతత్వ, పురుషాధిక్య భావజాలం ఉన్నవిగా ఎక్స్‌లో అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎలిఫెంటా గుహల్లోని శివపార్వతులను ఏకరూపంలో చూపించే అర్ధనారీశ్వర శిల్పం ఫోటోను ఆయన పంచుకున్నారు. భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాల లోతుల్లోకి వెళ్లేకొద్దీ ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తోందని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లకు ఈ సంప్రదాయాలపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన ఆరోపించారు.
శివపార్వతుల శిల్పంతో మునుపటి పోస్ట్
గత మంగళవారం కూడా రాహుల్ గాంధీ ఇలాంటి పోస్టే చేశారు. పార్వతీ దేవి శివుడి ఒడిలో కూర్చున్న 12వ శతాబ్దపు ఆలయ శిల్పం ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మద్దతుదారుల మనసుల్లో భయం, కోపం, ద్వేషం వల అల్లుకున్నాయని, అందుకే వారు ప్రేమను వ్యక్తపరచలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. నిజమైన హిందువుగా వారిని ఆ వల నుంచి విడిపించడం తన బాధ్యత అని, అప్పుడే వారూ జీవితంలో ప్రేమ, ఆప్యాయతల అందాన్ని, ఆనందాన్ని అనుభవించగలరని రాహుల్ రాసుకొచ్చారు.
తల్లిదండ్రుల జ్ఞాపకాలు.. వివాదం నేపథ్యం
గత సోమవారం సోనియా గాంధీ రాసిన బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పోస్టుల పరంపర మొదలైంది. తన తల్లిదండ్రుల మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, భోజనం చేసేటప్పుడు నాన్న ఉండేవారని, నాన్న ఒడిలో అమ్మ కూర్చునేదని చెప్పారు. చిన్నతనంలో అదే సాధారణమని భావించి స్నేహితుల ఇంటికి వెళ్లినప్పుడు, వారి తల్లిదండ్రులు అలా కూర్చోకపోవడంతో ఎందుకిలా అని అడిగేవాడినని తెలిపారు. అలాగే తన నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ హత్యలు తమ కుటుంబాన్ని ఎలా కుదిపేశాయో కూడా గుర్తు చేసుకున్నారు. ఆకస్మికంగా తమ ఆధారాన్ని కోల్పోయామని, ఇందిరా గాంధీ తుపాకీ కాల్పుల్లో, రాజీవ్ గాంధీ బాంబు దాడిలో కళ్లెదుటే తునాతునకలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
హిమంత విమర్శలు.. కాంగ్రెస్ సమర్థన
రాహుల్ ప్రసంగం క్లిప్‌ను పంచుకున్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, ప్రత్యేకమైన రోజున కూడా తల్లికి ఇబ్బంది కలిగించకుండా ఉండలేకపోయారా అంటూ ఎద్దేవా చేశారు. ఈ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడం, రీలాంచ్ చేయడం వల్ల లాభం లేదని ప్రజలకు ఎప్పుడో అర్థమైందని వ్యాఖ్యానించారు. మరోవైపు సోషల్ మీడియాలో కొందరు రాహుల్‌ను విమర్శించగా, మరికొందరు తన తల్లిదండ్రుల గురించి మనసు విప్పి మాట్లాడటాన్ని సమర్థించారు. ప్రేమను దాచాల్సిన పని లేదని, ఆప్యాయత బలహీనత కాదని, భాగస్వామిని సమానంగా చూడటంతోనే సమానత్వం మొదలవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌లో రాహుల్‌కు మద్దతుగా నిలిచింది.




