Rahul Gandhi: "బీజేపీ ఎంపీలంతా ఓట్ల దొంగలే".. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఓట్ల దొంగతనం ద్వారానే బీజేపీ ఎంపీలు గెలుస్తున్నారని, వారిని ‘చొరబాటుదారులు’ అని పిలవాలని వ్యాఖ్యానించారు.
Rahul Gandhi: "బీజేపీ ఎంపీలంతా ఓట్ల దొంగలే".. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో "ఓట్ల దొంగతనం" జరుగుతోందని ఆరోపిస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత లోపించిందని, కొన్ని సంస్థలు అధికార పార్టీ చేతిలో రిమోట్ కంట్రోల్‌లా మారాయని ఆయన ధ్వజమెత్తారు.
బీజేపీకి చెందిన 240 మంది ఎంపీలలో దాదాపు ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారానే గెలిచారని రాహుల్ ఆరోపించారు. బీజేపీ తరచూ ఉపయోగించే పరిభాషను వాడుతూ.. "మరి ఇలా అక్రమంగా గెలిచిన వారిని 'చొరబాటుదారులు' అని పిలవాలా?" అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎన్నికలు నిజంగా నిష్పక్షపాతంగా జరిగితే, బీజేపీ కనీసం 140 సీట్లు కూడా గెలుచుకోలేదని ఆయన విశ్లేషించారు.
హర్యానా సర్కార్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఆ ప్రభుత్వమే ఒక 'చొరబాటుదారు'లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికల సంఘం (ECI) పనితీరును ప్రశ్నించిన రాహుల్, ఓటర్ల జాబితాల సవరణలో జరుగుతున్న అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
"వారి అసలు భయం సత్యం పట్లే" అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అక్రమ మార్గాల్లో సీట్లను గెలవడమే కాకుండా, ఏకంగా ప్రభుత్వాలనే కూల్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.




