Rahul Gandhi: రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ఆ బిల్లును ఓడించాం
Rahul Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోదీ విమర్శలకు రాహుల్ గాంధీ కౌంటర్. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే నష్టాన్ని కన్యాకుమారి సభలో వివరించారు.
Rahul Gandhi: రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాదికి అన్యాయం.. అందుకే ఆ బిల్లును ఓడించాం
Rahul Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లును విపక్షాలు అడ్డుకున్నాయంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘాటుగా సమాధానమిచ్చారు. తమిళనాడులోని కన్యాకుమారిలో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్న బీజేపీ పన్నాగాన్ని తాము అడ్డుకున్నామని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని రాహుల్ ఆరోపించారు. "మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని, అసంబద్ధమైన పునర్విభజన ద్వారా దేశ ఎన్నికల వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. ఈ పద్ధతి వల్ల తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయి బలహీనపడతాయి. అందుకే ఈ బిల్లును వ్యతిరేకించాం" అని ఆయన వివరించారు.
జనాభా నియంత్రణలో ఆదర్శంగా నిలిచిన దక్షిణాది రాష్ట్రాలకు, పునర్విభజన వల్ల సీట్లు తగ్గే ప్రమాదం ఉందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా సాధికారతపై ప్రధాని మోదీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, పునర్విభజనతో ముడిపెట్టకుండా నేరుగా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గాల సంఖ్యను మార్చి రాజకీయ లబ్ధి పొందాలన్న వ్యూహంతోనే ఎన్డీఏ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆయన విమర్శించారు.
తమిళనాడు హక్కుల కోసం, దక్షిణాది ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నిరంతరం పోరాడుతుందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు.




