Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ ఒక దోపిడీ యంత్రాంగం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ మోసపూరితంగా, దోపిడీ యంత్రాంగంగా మారిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 13 July 2026 4:09 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: భారత విద్యా వ్యవస్థ ఒక దోపిడీ యంత్రాంగం.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi: భారత్‌లో విద్యా వ్యవస్థ పూర్తిగా మోసపూరితంగా మారిందని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ విద్యా రంగంలో తక్షణమే విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్య పేరిట జరుగుతోన్న సామాన్యుల దోపిడీని నిలువరించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' (ట్విట్టర్) లో ఒక సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

"అవినీతి, అన్యాయం, పక్షపాత వైఖరి, నిజాయితీ లోపించడం... ఈ నాలుగు పదాలు నేను చెప్తున్నవి కావు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులే ప్రస్తుత విద్యా వ్యవస్థను ఉద్దేశించి వాడుతున్న పదాలు. భారత విద్యా వ్యవస్థ ఇప్పుడు కేవలం మోసపూరితమైన, ఒక దోపిడీ యంత్రాంగంగా మారిపోయింది" అని రాహుల్‌ గాంధీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన విద్యా వ్యవస్థ.. నేడు సగటు కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని మండిపడ్డారు.

విద్యా వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి వల్లే దేశంలో 'పేపర్‌ లీకేజీ మాఫియా' పురుడు పోసుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మాఫియా లక్షల మంది విద్యార్థులు ఏళ్లపాటు పడుతున్న కష్టాన్ని, వారి కలలను ఒక్క దెబ్బతో దోచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. "తప్పు చేసిన సంస్థలకు మళ్లీ టెండర్లు ఇస్తున్నారు, బాధ్యులైన అధికారులకు ప్రమోషన్లు ఇస్తున్నారు. కానీ, శిక్ష మాత్రం తమ కలలను సాధించుకోలేక, ఒంటరిగా మిగిలిపోతున్న అమాయక విద్యార్థులకు పడుతోంది" అని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీకి, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు విద్యా రంగంలో జరుగుతున్న అక్రమాలన్నీ తెలిసినా.. జవాబుదారీతనం లేకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

ఇప్పుడైనా జరిగిందేదో జరిగిపోయిందని, దేశ విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు, విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు తనతో కలిసి అడుగేయాలని రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు. దేశ విద్యా వ్యవస్థలోని సమస్యల పరిష్కారానికి, విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే లక్ష్యంతో ఆయన ‘ఛాత్రోం కీ గూంజ్‌’ పేరిట భారీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలివిడతగా జూన్‌ 17న రాజస్థాన్‌లోని కోటాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా.. రెండో విడత కార్యక్రమం ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్‌లో జులై 17న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story