Rahul Gandhi: 'ఇంకా చాల్లే బ్రో.. రాజీనామా చేయ్' : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన పోస్ట్!
Rahul Gandhi: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఓట్ల తొలగింపు అంశంపై దిల్లీలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.
Rahul Gandhi: 'ఇంకా చాల్లే బ్రో.. రాజీనామా చేయ్' : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ సంచలన పోస్ట్!
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘జ్ఞానేశ్.. ఇక చాల్లే బ్రో.. రాజీనామా చేసే సమయం వచ్చింది’ అంటూ సోషల్ మీడియా వేదికగా 'ఎక్స్' (X) లో ఆయన చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశ రాజధాని దిల్లీలో ఇండియా కూటమి (INDIA Bloc) నేతలు మరియు కార్యకర్తలు ఎన్నికల సంఘం కార్యాలయం వైపు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు.
ఈసీ కార్యాలయం వైపు బయలుదేరిన ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకోవడంతో, వారు నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ, ఎన్సీపీ-ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా కాలరాస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. స్వాతంత్ర్యం తర్వాత ఎంతో కష్టపడి సాధించుకున్న సార్వత్రిక వయోజన ఓటుహక్కును కూడా అధికార పార్టీ బలహీనపరుస్తోందని, ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తోందని మండిపడ్డారు.
'సర్' (SIR) ప్రక్రియ పేరుతో ఏకంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని, ఇది ప్రజలపై చేసిన అతిపెద్ద ఎన్నికల మోసమని కాంగ్రెస్ ఎంపీ ధర్మవీర్ గాంధీ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడుకునేందుకు చివరి వరకు పోరాడుతామన్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను రద్దు చేయాలని.. అలాగే తొలగించిన ఓటర్లందరి పేర్లను వెంటనే జాబితాలో తిరిగి చేర్చాలని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ డిమాండ్ చేశారు.




