Rahul Gandhi: ‘సత్యాగ్రహ’ పోర్టల్‌ను ప్రారంభించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: దేశవ్యాప్తంగా నిరసనలను ఒకతాటిపైకి తెచ్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 'సత్యాగ్రహ' పోర్టల్‌ను ప్రారంభించారు.
Rahul Gandhi: ‘సత్యాగ్రహ’ పోర్టల్‌ను ప్రారంభించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: దేశవ్యాప్తంగా వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలపై చేపడుతున్న నిరసనలను ఒకతాటిపైకి తీసుకువచ్చే లక్ష్యంతో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నూతనంగా ‘సత్యాగ్రహ’ (Satyagraha) డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో సత్యాన్ని అణిచివేస్తున్నారని, దానిని అడ్డుకోవడం ప్రతిపక్ష నేతగా తన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఎక్కడ నిరసన చేపట్టినా వాటిని ఈ పోర్టల్‌లో నమోదు చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా ప్రజలు తమ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ, వారంతా ఒంటరిగా పోరాడుతున్నందు వల్ల ప్రభుత్వం వారి గళాన్ని అణచివేస్తోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
జెన్‌జీ (Gen Z), విద్యార్థులు, రైతులు, ఆదివాసీలు, దళితులు, మహిళలు ఇలా ప్రతి ఒక్కరూ చేస్తున్న పోరాటాల వెనుక బలమైన కారణాలు ఉన్నాయని, ఆ గళాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ ‘సత్యాగ్రహ’ పోర్టల్ అని తెలిపారు.
సత్యమే మన గొప్ప ఆయుధమని మహాత్మా గాంధీ మనకు బోధించారని, అంతకంటే గొప్పది సత్యం పక్షాన నిలబడటమని ఆయన ఉద్ఘాటించారు.
‘‘మీరు కూడా ఏదైనా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే, మీ కథనాన్ని పంచుకోండి. పార్లమెంటులో అయినా, వీధుల్లో అయినా సరే.. మీ సమస్యలు తీర్చి, అండగా నిలవడానికి నా శక్తిమేర కృషి చేస్తాను. ప్రతిపక్ష నాయకుడిగా అది నా బాధ్యత. మీ సత్యాగ్రహ కథనాన్ని నాకు తెలియజేయండి. దేశం మొత్తం మీ పోరాటాల గురించి తెలుసుకుంటుంది, మీకు మద్దతుగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు.




