Rahul Gandhi: అప్రూవర్‌గా మారి రాజీనామా చేయండి.. లేదంటే వదిలిపెట్టం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ గాంధీ హెచ్చరిక!

Rahul Gandhi: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 12 Oct 2026 1:06 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: అప్రూవర్‌గా మారి రాజీనామా చేయండి.. లేదంటే వదిలిపెట్టం: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు రాహుల్ గాంధీ హెచ్చరిక!

Rahul Gandhi: సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా డిమాండును మరింత బలంగా వినిపించేందుకు కాంగ్రెస్‌ పార్టీ సుప్రీం కోర్టు వరకు భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ఆందోళన కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరసనల వేళ ఢిల్లీని ఎందుకు జైలుగా మార్చారని ప్రశ్నిస్తూ, కేంద్రం మరియు ఎన్నికల కమిషన్‌పై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ నుంచి తనకు సందేశాలు వస్తున్నాయని రాహుల్‌ గాంధీ ఈ సందర్భంగా వెల్లడించారు. ‘‘ఆయన ఎంతటి తీవ్రమైన ఒత్తిడిలో పనిచేస్తున్నారో మేం అర్థం చేసుకోగలము. ఇప్పటికైనా ఆయన అప్రూవర్‌గా మారి తన పదవికి రాజీనామా చేయాలి. అదే ఆయన ఈ దేశానికి చేసే నిజమైన సేవ. అలా చేస్తే మేం ఆయనను క్షమిస్తాం. ప్రస్తుత పరిణామాలతో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని మాకు తెలుసు. ఆయన రాజీనామా చేసేంతవరకు మేం పోరాటాన్ని వదిలిపెట్టబోం’’ అని రాహుల్ స్పష్టం చేశారు.

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) ఆందోళనల వేళ దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టించిందని రాహుల్ ఆరోపించారు. ‘‘గత 12 ఏళ్లుగా బీజేపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే, దాన్ని అణచివేసేందుకు ఢిల్లీ రోడ్లపై దాదాపు 30 వేల మంది పోలీసులను మోహరించారు. ప్రజలు, యువత దేశ రాజధానికి రాకుండా అడ్డుకుంటున్నారు. అసలు మొత్తం ఢిల్లీని కోటగా, జైలుగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను కాపాడుతున్నది ఎవరు? ఆర్‌ఎస్‌ఎస్‌ గూండాలకు ఉన్న స్వేచ్ఛ దేశ యువతకు, మహిళలకు ఎందుకు లేదు?’’ అని రాహుల్‌ గాంధీ నిలదీశారు.

దేశంలో ప్రజాస్వామ్య ఖూనీ, ఎన్నికల్లో జరుగుతున్న 'ఓట్ల చోరీ' అక్రమాలపై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ దృష్టికి తీసుకెళ్లేందుకు అపాయింట్‌మెంట్‌ కోరినా అనుమతి లభించలేదని రాహుల్ తెలిపారు. ‘‘మా విజ్ఞప్తిని సీజేఐ తిరస్కరించి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవాలని సూచించారు. అందుకోసమే మేము ఈ రోజు సుప్రీంకోర్టు వరకు ర్యాలీగా వెళ్లి పిటిషన్ దాఖలు చేస్తున్నాం. అయితే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజ్యాంగబద్ధ పదవికి సీజేఐ అపాయింట్‌మెంట్ ఎందుకు నిరాకరించారు? ఆయనను ఎవరు నిర్దేశిస్తున్నారు?’’ అని ప్రశ్నించారు.

ఈ పోరాటం కేవలం నరేంద్ర మోదీకి, తనకూ మధ్య జరుగుతున్న వ్యక్తిగత యుద్ధం కాదని, ఇది దేశ యువత భవిష్యత్తు మరియు రాజ్యాంగ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటమని రాహుల్ స్పష్టం చేశారు. ‘‘ఒకవైపు ప్రజలు, ప్రతిపక్షాలు ఉంటే.. మరోవైపు మోదీ, అమిత్‌ షా, అజిత్‌ ఢోబాల్, జ్ఞానేశ్‌ కుమార్‌, మోహన్‌ భాగవత్‌ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని 200 మంది అధికారులు ప్రస్తుతం మాతో టచ్‌లో ఉన్నారు. ఎన్నికల వ్యవస్థ ప్రక్షాళన జరిగి, ఆ ఐదుగురు నేరగాళ్లు న్యాయవిచారణ ఎదుర్కొనే వరకు మా పోరాటం ఆగదు’’ అని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.