Rahul Gandhi: ఫారం-6 మార్పులు ఎవరి ఆదేశాలతో జరిగాయి?.. ఎన్నికల సంఘాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi: ఓటరు నమోదు ఫారం-6లో మార్పులపై ఎన్నికల సంఘాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ. టీసీఎస్‌తో మార్పులు చేయించింది ఎవరంటూ ఎక్స్ వేదికగా ప్రశ్నలు.

Arun Chilukuri
Published on: 1 Oct 2026 3:00 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: ఫారం-6 మార్పులు ఎవరి ఆదేశాలతో జరిగాయి?.. ఎన్నికల సంఘాన్ని నిలదీసిన రాహుల్ గాంధీ!

Rahul Gandhi: ఓటరు నమోదుకు ఉపయోగించే ఆన్‌లైన్ ఫారం-6లో జరిగిన మార్పులు ఎవరి ఆదేశాలతో జరిగాయో బయటపెట్టాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ‘‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)తో ఈ మార్పులు చేయించింది ఎవరు? టీసీఎస్‌లో దీనికి ఆమోదం తెలిపింది ఎవరు? ఆ సంస్థపై ఏమైనా ఒత్తిడి తెచ్చారా?’’ అంటూ ఆయన ఎక్స్ (ట్య్విటర్) వేదికగా వరుస ప్రశ్నలు సంధించారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వచ్చిన నూతన నిబంధనలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషి అభ్యంతరం తెలిపినట్లు వార్తలు రావడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.

కొత్తగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వారు తండ్రి, తాతల పేర్లను వెల్లడించాలని పేర్కొంటూ ఫారం-6కు అదనంగా డిక్లరేషన్‌ను జోడించడంతో ఈ వివాదం చెలరేగింది. ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ వివరాలు ఇవ్వకపోతే దరఖాస్తు ముందుకు సాగకపోవడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు.

వివాదం ముదరడంతో 'సర్' (SIR) ప్రక్రియ పూర్తయిన రాష్ట్రాల్లో ఈ అదనపు డిక్లరేషన్ నిబంధనను సెప్టెంబర్ 30 నుంచి ఈసీ తొలగించింది. అయితే, ప్రస్తుతం 'సర్' ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో మాత్రం ఈ నిబంధన ఇంకా కొనసాగుతుండటం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.