Rahul Gandhi: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఎందుకో తెలుసా?

Rahul Gandhi: తన తల్లిదండ్రులు రాజీవ్, సోనియా గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని 'వర్సిటీ రెస్టారంట్'కు గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడించారు.

Arun Chilukuri
Published on: 17 Nov 2026 11:05 AM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ రెస్టారెంట్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ.. ఎందుకో తెలుసా?

Rahul Gandhi: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర, సరదా విషయాన్ని బహిరంగంగా పంచుకున్నారు. తన తల్లిదండ్రులు సోనియా గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ తొలిసారి కలుసుకున్న కేంబ్రిడ్జ్‌లోని ఓ రెస్టారంట్‌కు తాను కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి వెళ్లినట్లు వెల్లడించారు. అయితే అక్కడి ఆహారం మాత్రం తనను తీవ్రంగా నిరాశపరిచిందని చమత్కరించారు.

సోమవారం దిల్లీలో నిర్వహించిన సోనియా గాంధీ ఆత్మకథ ‘‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’’ అధికారిక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పాల్గొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

‘‘చాలా సంవత్సరాల తర్వాత నేను కేంబ్రిడ్జ్‌కు వెళ్లాను. అప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్‌తో ‘మనమిద్దరం వర్సిటీ రెస్టారంట్‌కు వెళ్దాం’ అని చెప్పాను. అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నానో ఆమెకు తెలియదు. నా తల్లిదండ్రులు ఎక్కడ కలుసుకున్నారో చూడాలనేది నా ఉద్దేశం. లోపలికి వెళ్లిన తర్వాత నా తల్లిదండ్రులు ఈ రెస్టారంట్‌లోనే కలుసుకున్నారని అక్కడి వ్యక్తికి చెప్పాను. వెంటనే అతను ‘ఓహ్.. వాళ్లా! నాకు తెలుసు’ అన్నాడు’’ అని రాహుల్‌ వివరించారు.

అక్కడి ఆహారం గురించి సరదాగా మాట్లాడుతూ.. ‘‘మీరు ప్రేమలో పడాలనుకుంటే మాత్రం వర్సిటీ రెస్టారంట్‌కు వెళ్లండి. కానీ అక్కడి చికెన్‌ వంటకం మాత్రం ఎప్పుడూ తినకండి. మా తల్లిదండ్రులకు అక్కడి ఆహారం అద్భుతంగా అనిపించింది, చాలా బాగుందని వారు గుర్తు చేసుకున్నారు. కానీ నాకు మాత్రం అక్కడి భోజనం అస్సలు నచ్చలేదు’’ అంటూ సభలో నవ్వులు పూయించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విలేకరులు రాహుల్‌ను ‘మీ ప్రియురాలు ఇప్పుడు ఎక్కడున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘‘ఆమె నా స్నేహితురాలు’’ అని చిరునవ్వుతో సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్‌ భారత శాఖ సీఈఓ అనంత్‌ పద్మనాభన్‌ మాట్లాడుతూ.. సోనియా గాంధీ ఆత్మకథ విడుదలై వారం కూడా గడవకముందే 2 లక్షలకు పైగా కాపీలు అమ్ముడుపోయాయని వెల్లడించారు. స్వతంత్ర భారతదేశంలో విడుదలైన అతిపెద్ద ఆత్మకథగా ఈ పుస్తకం రికార్డు సృష్టించిందన్నారు.

పుస్తకాన్ని కొన్నవాళ్లు, ఆర్డర్‌ చేసి చేతికి అందడం కోసం ఎదురుచూస్తున్నవారు.. అలాగే పుస్తకం చదివినప్పటికీ ఆ విషయాన్ని బయటకు చెప్పడానికి ధైర్యం చేయనివారు కొందరు అంటూ పద్మనాభన్‌ చమత్కరించారు. ఆయన వ్యాఖ్యలతో సభలో పెద్ద ఎత్తున నవ్వులు, చప్పట్లు వినిపించాయి. ముందు వరుసలో కూర్చున్న సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ సైతం మనస్ఫూర్తిగా నవ్వుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.