Rahul Gandhi : నీట్ రచ్చ.. మోదీ వీడియోపై కాంగ్రెస్ ఎదురుదాడి

Rahul Gandhi : నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో..

G Krishna
Published on: 24 July 2026 11:52 AM IST
Rahul-Gandhi
X

Rahul-Gandhi

Rahul Gandhi : నీట్-యుజి (NEET-UG) పేపర్ లీక్ అక్రమాలు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్ధరాత్రి విడుదల చేసిన వీడియో సందేశంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని వైఖరిని తప్పుబడుతూ విద్యార్థుల తెలివితేటలను తక్కువ చేసి చూడవద్దని హెచ్చరించారు. అంతేకాకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసుల దాడికి ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ 3 కీలక డిమాండ్లు..

ప్రధాని మోదీ వీడియోపై సామాజిక మాధ్యమం ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ, దేశంలోని విద్యార్థులంతా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి అర్ధరాత్రి వీడియోలతో వారి తెలివితేటలను అవమానించవద్దని పేర్కొంటూ మూడు ప్రధాన డిమాండ్లను మోదీ ముందుంచారు. ముందుగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని , బాధితులైన విద్యార్థులకు ప్రధాని వెంటనే క్షమాపణ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

పార్లమెంట్‌కు వచ్చే ముందే రాజీనామా చేయించండి: ఖర్గే సవాల్

కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రధాని తన ప్రకటనను సభలోనే చేయాలి తప్ప, బయట రాత్రిపూట అర్ధరాత్రి వేళల్లో ఏకపక్షంగా వీడియోలు రికార్డ్ చేసి మాట్లాడటం సరికాదని విమర్శించారు. పార్లమెంట్‌లోకి అడుగుపెట్టే ముందే ధర్మేంద్ర ప్రధాన్‌ను డిస్మిస్ చేసి రావాలని, విద్యార్థులకు క్షమాపణ చెప్పడంతో పాటు వారిపై లాఠీలు, పెల్లెట్ గన్లు ఉపయోగించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఖర్గే సవాల్ విసిరారు.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ స్పందిస్తూ, ప్రధాని విడుదల చేసిన వీడియోలో విద్యార్థుల ఆందోళనల గురించి గానీ, వారిపై జరిగిన పోలీసుల దౌర్జన్యం గురించి గానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విచారకరమని అన్నారు. విద్యాశాఖ మంత్రి పార్లమెంటరీ కమిటీ ముందు కూడా పేపర్ లీక్ జరగలేదని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. మరోవైపు శివసేన (యుబిటి) నాయకురాలు ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే ప్రభుత్వం తీసుకునే తొలి బాధ్యతాయుతమైన చర్య అవుతుందని పేర్కొన్నారు.

వచ్చే వారమే పేపర్ లీక్‌లపై కఠిన చట్టం: ప్రధాని మోదీ

ప్రతిపక్షాల విమర్శల నడుమ ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అక్రమాలకు పాల్పడే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకునేలా రూపొందించిన కొత్త బిల్లును వచ్చే వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ బిల్లు నిబంధనలపై సమగ్రంగా చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపారు. అయితే ప్రధాని మోదీ ఈ వీడియో సందేశాన్ని విడుదల చేసిన గంట వ్యవధిలోనే, గత 26 రోజులుగా నీట్ అక్రమాలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ గుర్గావ్‌లోని ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సమక్షంలో దీక్ష విరమించడం గమనార్హం.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story