Rahul Gandhi: మహిళా బిల్లు ఓ పెద్ద కుట్ర.. ఓబీసీల నుంచి అధికారం లాక్కుంటున్నారు
Rahul Gandhi: మహిళా బిల్లు ముసుగులో దేశ రాజకీయాలను మార్చే కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, పాత బిల్లునే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Rahul Gandhi: మహిళా బిల్లు ఓ పెద్ద కుట్ర.. ఓబీసీల నుంచి అధికారం లాక్కుంటున్నారు
Rahul Gandhi: పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ మరియు డీలిమిటేషన్ బిల్లులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లులు మహిళా సాధికారత కోసం తెచ్చినవి కావని, వీటి వెనుక దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు.
"2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనుకుంటే ఆ పాత బిల్లునే వెంటనే అమలు చేయాలి. ఒకవేళ లోపాలు ఉంటే పాత దాన్ని రద్దు చేసి కొత్తగా తీసుకురండి, మేం మద్దతిస్తాం" అని రాహుల్ సవాల్ విసిరారు.
ఈ బిల్లు ఓబీసీలు, దళితులు, మైనార్టీల పట్ల క్రూరమైన చర్య అని ఆయన అభివర్ణించారు. దేశ అత్యున్నత బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, ప్రైవేటు రంగాల్లో ఓబీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని, వారికి అధికారం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదని విమర్శించారు.
"కులగణన ప్రారంభమైందని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు కులగణన నివేదిక రాకుండానే డీలిమిటేషన్ ఎందుకు చేపడుతున్నారు?" అని రాహుల్ ప్రశ్నించారు. ఇది దక్షిణాది మరియు చిన్న రాష్ట్రాలను గౌరవించని చర్య అని మండిపడ్డారు.
సభలో గందరగోళం - క్షమాపణకు డిమాండ్:
ప్రసంగం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ పరోక్షంగా 'ఇంద్రజాలికుడు' అంటూ చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిని అవమానించేలా మాట్లాడినందుకు రాహుల్ వెంటనే క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిరణ్ రిజిజు డిమాండ్ చేశారు. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని సభలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.




