Rahul Gandhi: "సీబీఎస్‌ఈలో జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త!".. కొత్త స్కానింగ్ విధానంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Rahul Gandhi: "సీబీఎస్‌ఈలో జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త!".. కొత్త స్కానింగ్ విధానంపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు!
Rahul Gandhi: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్-స్క్రీన్ మార్కింగ్' (OSM) మూల్యాంకన ప్రక్రియ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది. 12వ తరగతి ఫలితాలలో జరిగిన బోర్డు తప్పిదాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ యాజమాన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బోర్డు చేసిన బ్లండర్ తప్పుల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవ్వడమే కాకుండా, వారి నుంచి ప్రభుత్వం కోట్లాది రూపాయలు దోచుకుంటోందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన విద్యార్థులతో ముచ్చటించిన ఒక ప్రత్యేక వీడియోను తన అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేశారు.
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో సీబీఎస్‌ఈని జేబుదొంగలతో పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "దేశంలో జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త. వారు ఇప్పుడు నేరుగా సీబీఎస్‌ఈ కార్యాలయంలోనే తిష్ట వేశారు. బోర్డు చేసిన దారుణమైన పొరపాట్ల వల్ల విద్యార్థుల మార్కులు తప్పుగా వస్తే.. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి విద్యార్థులే భారీగా బిల్లులు చెల్లించాల్సి వస్తోంది" అని రాహుల్ విమర్శించారు.
విద్యార్థులు తమ జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయించుకోవడానికి పడుతున్న ఖర్చుల పట్టికను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విశ్లేషించారు.
డిజిటల్ స్కాన్ కాపీ కోసం: ఒక సబ్జెక్టుకు రూ.100
పేపర్ రీటోటలింగ్ కోసం: ఒక పేపర్‌కు రూ.100
రీవాల్యుయేషన్ కోసం: కేవలం ఒక ప్రశ్నకు రూ.25
మొత్తం భారం: ఈ లెక్కన ఒక విద్యార్థి తన జవాబు పత్రాన్ని (ఆన్సర్ షీట్) పూర్తిగా సరిగా దిద్దించుకోవాలంటే దాదాపు రూ.2000 వరకు చెల్లించాల్సి వస్తోంది.
"దేశవ్యాప్తంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఈ తప్పుల సవరణ కోసం దరఖాస్తు చేసుకుంటే.. సీబీఎస్‌ఈ విద్యార్థుల నుంచి ఎంత భారీగా సొమ్ము ఆర్జిస్తోందో గమనించాలి. తప్పు బోర్డుది.. శిక్ష పడుతున్నది విద్యార్థులకు.. కానీ ఆదాయం మాత్రం ప్రభుత్వానికి వెళ్తోంది. విద్య ఒక వ్యాపారంగా మారితే ఇలాగే ఉంటుంది" అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనే రాహుల్ గాంధీ ఈ విధానం వెనుక ఉన్న టెండర్ల కుంభకోణాన్ని ఎండగట్టారు. వాస్తవానికి నిబంధనల ప్రకారం.. 300 DPI నాణ్యత గల ఆటోమేటిక్ రోబోటిక్ స్కానర్లను ఉపయోగించి జవాబు పత్రాలను స్కాన్ చేయాల్సి ఉంది. కానీ టెండర్ నిబంధనలను తుంగలో తొక్కి, ఆన్సర్ షీట్లను కేవలం మొబైల్ ఫోన్ల సాయంతో స్కాన్ చేశారని ఆయన ఆరోపించారు. ఫోన్ కెమెరాలతో స్కాన్ చేయడం వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించక తప్పిదాలు జరగడం ఖాయమని, ఈ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తమ సమయాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మరియు భవిష్యత్తును మూల్యంగా చెల్లించుకుంటున్నారని మండిపడ్డారు.
ఇటీవలే దేశాన్ని కుదిపేసిన నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతం మరువకముందే.. ఇప్పుడు సీబీఎస్‌ఈ 12వ తరగతి మూల్యాంకన వివాదం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.




