Bulldozer Action : బాలికపై అఘాయిత్యం.. బుల్డోజర్ల యాక్షన్.!
Bulldozer Action : రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత క్రూరమైన, అమానుషమైన ఉదంతం ఒకటి వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన..
Bulldozer Action
Bulldozer Action : రాజస్థాన్‌లోని శ్రీ గంగనగర్ జిల్లాలో మానవత్వాన్ని మంటగలిపే అత్యంత క్రూరమైన, అమానుషమైన ఉదంతం ఒకటి వెలుగుచూసింది. రక్షణగా నిలవాల్సిన సమాజంలో కొందరు కామాంధులు ఒక చిన్నారిపై జరిపిన దాడి దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం 13 ఏళ్ల మైనర్ బాలికను బంధించి, ఐదు రోజుల పాటు ఏకంగా 30 మందికి పైగా మృగాళ్లు విచక్షణారహితంగా లైంగిక దాడికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటనపై ప్రజల్లో వ్యక్తమవుతున్న తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో.. మంగళవారం అర్ధరాత్రి జిల్లా యంత్రాంగం, భారీగా మోహరించిన పోలీసు బలగాలు కలిసి ఈ పాపానికి అడ్డాగా మారిన నాలుగు హోటళ్లను బుల్డోజర్లతో పూర్తిగా కూల్చివేసి నేలమట్టం చేశాయి.
ఒక్క రిక్షా కార్మికుడితో మొదలైన నరకం
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు , బాధితురాలి స్టేట్‌మెంట్ ప్రకారం.. ఈ ఘోరానికి సంబంధించిన వివరాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. జూన్ 18వ తేదీన సదరు బాలిక తన ఇంటి నుంచి హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలికను గమనించిన ఒక రిక్షా కార్మికుడు ఆమెకు సాయం చేస్తానని నమ్మించి, నేరుగా నగరంలోని ఒక హోటల్ యజమానికి అమ్మేశాడు. అక్కడి నుంచి ఆ చిన్నారికి నరకం మొదలైంది. ఐదు రోజుల పాటు నగరంలోని వేర్వేరు హోటళ్లకు ఆ బాలికను గుట్టుచప్పుడు కాకుండా మారుస్తూ.. సుమారు 30 మందికి పైగా కామాంధులు ఆమెపై వరసగా అఘాయిత్యానికి పాల్పడ్డారు. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. వరుస దాడుల వల్ల ఆ బాలిక తీవ్రమైన నొప్పితో హాహాకారాలు చేసినప్పుడల్లా, ఆ నరకం తెలియకుండా ఉండేందుకు నిందితులు ఆమెతో బలవంతంగా మద్యం తాగించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.
నేరాన్ని దాచాలని చూసిన హోటల్ యాజమాన్యాలు
ఈ వ్యవస్థీకృత నేరంలో కేవలం బయట వ్యక్తులే కాకుండా, ఆయా హోటళ్ల యజమానులు, అక్కడ పనిచేసే నిర్వాహకులు కూడా సమాన భాగస్వాములయ్యారని దర్యాప్తులో తేలింది. తమ హోటల్ గదుల్లో ఒక చిన్నారిపై ఇంతటి ఘోరం జరుగుతున్నా వారు కనీసం పోలీసులకు సమాచారం ఇవ్వకపోగా, ఈ నేరం ఎక్కడ బయటకు పొక్కుతుందోనని బయటకు పొక్కకుండ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ దారుణంలో హోటల్ యాజమాన్యాల పాత్ర కూడా స్పష్టంగా రుజువు కావడంతో, అలాగే ఆయా హోటల్ భవనాలు చట్టవిరుద్ధమైన నిబంధనలతో నిర్మించారని తేలడంతో అధికారులు బుల్డోజర్లను రంగంలోకి దించారు. అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆ నాలుగు హోటల్ నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేశారు.
రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. ఇప్పటివరకు 12 మంది అరెస్ట్
ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఈ పాపంలో పాలుపంచుకున్న 12 మంది నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని, నిందితులకు చట్టపరంగా పడే అత్యంత కఠినమైన శిక్ష పడేలా కోర్టులో బలమైన ఆధారాలు ప్రవేశపెడతామని జిల్లా ఎస్పీ హరిశంకర్ మీడియాకు వెల్లడించారు.
మండిపడుతున్న స్థానికులు.. విపక్షాల భారీ నిరసనలు
ఈ దారుణ ఉదంతం బయటకు రావడంతో శ్రీ గంగనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర నిరసనలతో రోడ్లపైకి వచ్చారు. మహిళా సంఘాలు, స్థానికులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ నిందితులకు తక్షణమే ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటన రాజస్థాన్ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో, ముఖ్యంగా మైనర్ బాలికలకు రక్షణ కల్పించడంలో స్థానిక ప్రభుత్వం , యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని మండిపడింది. బాధ్యులందరిపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.




