Sadbhavana Diwas 2026: రాజీవ్‌గాంధీ జయంతి రోజునే సద్భావన దివస్‌... ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆగస్టు 20న సద్భావన దివస్ ఎందుకు జరుపుకుంటారు? జాతీయ సమైక్యత, సోదరభావం, రాజీవ్ గాంధీ ఆలోచనలు, ఆయన పాలనలోని కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం.

Balachander
Published on: 20 Aug 2026 7:00 AM IST
Sadbhavana Diwas 2026: రాజీవ్‌గాంధీ జయంతి రోజునే సద్భావన దివస్‌... ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
X

Sadbhavana Diwas 2026: సాంకేతిక విప్లవ పితామహుడు, దేశంలోనే అతిచిన్న వయసులో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన రాజీవ్ గాంధీ జయంతి (ఆగస్టు 20)ని ప్రతీ ఏటా ‘సద్భావన దివస్’గా జరుపుకోవడం వెనుక ఒక బలమైన సామాజిక లక్ష్యం ఉందనేది చారిత్రక వాస్తవం. భారత దేశ వైవిధ్యాన్ని హింసతో కాక, చర్చలు, సంభాషణల ద్వారానే సామరస్యంగా ముందుకు తీసుకెళ్లగలమనే సందేశాన్ని భావితరాలకు ఇవ్వడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

పైలట్ నుంచి ప్రధాని పీఠం వరకు.. 40 ఏళ్లకే దేశ నాయకత్వం

రాజీవ్ గాంధీ రాజకీయ ప్రస్థానం ఎంతో భిన్నమైనది. ప్రారంభంలో రాజకీయాలకు దూరంగా పైలట్‌గా జీవితాన్ని సాగించిన ఆయన, 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం అత్యంత క్లిష్ట సమయాల్లో 40 ఏళ్ల వయసులోనే భారత ఆరో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984 డిసెంబర్ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 404 స్థానాల చారిత్రాత్మక మెజారిటీని అందించి, తన నాయకత్వ పటిమను చాటారు. 1984 నుండి 1989 వరకు సాగిన ఆయన పాలనలో దేశ రాజకీయ, సాంకేతిక చిత్రపటమే మారిపోయింది. 1984 కంప్యూటర్ పాలసీ, 1986 సాఫ్ట్‌వేర్ విధానాలతో దేశంలోకి కంప్యూటర్ వ్యవస్థను తీసుకువచ్చారు. సీ-డాట్, ఎంటీఎన్‌ఎల్ ఏర్పాటు, ఊరూరా పీసీఓ కేంద్రాల విస్తరణ ద్వారా సామాన్యుడికి టెలిఫోన్‌ను అందుబాటులోకి తెచ్చారు.

యువతకు ఓటు హక్కు

61వ రాజ్యాంగ సవరణ (1988) ద్వారా ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి లక్షలాది మంది యువతను నిర్ణయాత్మక రాజకీయ భాగస్వాములను చేశారు. అదేవిధంగా 1986 జాతీయ విద్యా విధానం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్యనందించే 'జవహర్ నవోదయ విద్యాలయ' వ్యవస్థకు శ్రీకారం చుట్టారు.

సద్భావనా ప్రతిజ్ఞ ... జాతీయ సమైక్యతకు చిహ్నం

ఆగస్టు 20న ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పౌర సమాజంలో 'సద్భావనా ప్రతిజ్ఞ' స్వీకరిస్తారు. కుల, మత, ప్రాంతీయ వ్యత్యాసాలను పక్కనబెట్టి, హింసాత్మక మార్గాలను నిరాకరిస్తూ.. రాజ్యాంగబద్ధమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని పౌరులు ఈ రోజున ప్రమాణం చేస్తారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తారు.

రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన పురస్కారం

దేశంలో మతసామరస్యం, శాంతి, జాతీయ సమైక్యత కోసం కృషి చేసిన వ్యక్తులకు లేదా సంస్థలకు 1992 నుంచి ఈ జాతీయ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఇందులో 10 లక్షల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం బహుకరిస్తారు. దేశంలోని ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలు, విద్యావ్యవస్థలో మార్పుల కోసం కృష్టి చేస్తున్న సామాజిక వేత్తలు ఎందరికో రాజీవ్‌ గాంధీ జాతీయ సద్భావన పురస్కారం అందుకున్నారు.

1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదుల ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయిన రాజీవ్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం మరణానంతరం 'భారత రత్న' ప్రకటించింది. డిజిటల్ భారత్‌కు పునాది వేసిన ఆయన ఆలోచనా విధానం, సద్భావన దివస్ రూపంలో దేశంలో ఐక్యతా జ్యోతిని వెలిగిస్తూనే ఉంది. నేడు భారత్‌ డిజిటల్‌ రంగంలో ఆకాశాన్ని అందుకుంటోంది అంటే అది రాజీవ్‌ గాంధీ వేసిన పునాధి అని చెప్పవచ్చు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story