రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్: ఆప్‌లో మిగిలింది ముగ్గురే.. ఏడుగురిపై ‘విలీన’ ముద్ర!

CP Radhakrishnan: రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. రాఘవ్ చడ్ఢా, హర్భజన్ సింగ్ సహా ఏడుగురు ఎంపీలు బీజేపీలో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం తెలిపారు.

Arun Chilukuri
Published on: 27 April 2026 3:19 PM IST
రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్: ఆప్‌లో మిగిలింది ముగ్గురే.. ఏడుగురిపై ‘విలీన’ ముద్ర!
X

రాజ్యసభ ఛైర్మన్ గ్రీన్ సిగ్నల్: ఆప్‌లో మిగిలింది ముగ్గురే.. ఏడుగురిపై ‘విలీన’ ముద్ర!

CP Radhakrishnan: దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో విలీనం కావడానికి రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ అధికారికంగా ఆమోదముద్ర వేశారు. ఈ పరిణామంతో ఎగువ సభలో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.

రాఘవ్‌ చడ్ఢా, హర్భజన్‌ సింగ్‌, స్వాతి మాలీవాల్‌ వంటి కీలక నేతలతో సహా మొత్తం ఏడుగురు ఎంపీలు ఆప్‌ను వీడి బీజేపీలో చేరారు. తమను బీజేపీ సభ్యులుగానే పరిగణించాలని వారు చేసిన విన్నపాన్ని ఛైర్మన్ ఆమోదించడంతో, రాజ్యసభ అధికారిక వెబ్‌సైట్‌లో వీరి పేర్లు ఇప్పుడు బీజేపీ జాబితాలోకి చేరాయి. ఈ విలీనంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు పెరగగా, ఆప్ బలం కేవలం మూడుకు పడిపోయింది.

ఫిరాయింపు నిరోధక చట్టం నుండి తప్పించుకోవడానికి ఈ ఏడుగురు ఎంపీలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్యసభలో ఆప్‌కు ఉన్న మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతుల కంటే ఎక్కువ మంది (7/10) ఒకేసారి విడిపోయి బీజేపీలో విలీనం కావడంతో సాంకేతికంగా వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేకుండా పోయింది.

"గత కొన్నేళ్లుగా ఆప్ దేశం కోసం కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము ఆ పార్టీని వీడి బీజేపీలో విలీనమయ్యాం" అని ఎంపీలు పేర్కొన్నారు. అయితే, పార్టీ మారిన ఈ ఏడుగురిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆప్ ఆదివారం ఛైర్మన్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ, విలీనానికే ఛైర్మన్ మొగ్గు చూపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story