Ramdev Baba: ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి.. విద్యావ్యవస్థపై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు!

Ramdev Baba: విద్యా, ఉద్యోగ నియామక వ్యవస్థల్లో 90 శాతం అవినీతి జరుగుతోందని యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు. పేపర్ లీక్‌లు, విద్యార్థుల నిరసనలపై పతంజలి యోగపీఠంలో ప్రసంగం.

Arun Chilukuri
Published on: 15 Aug 2026 5:03 PM IST
Ramdev Baba
X

Ramdev Baba: ఇంటర్వ్యూల్లో 90 శాతం అవినీతి.. విద్యావ్యవస్థపై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు!

Ramdev Baba: దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో పెరుగుతున్న గందరగోళం, ఆందోళనలు విద్యా మరియు ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్ర లోపాలను ఎత్తిచూపుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం హరిద్వార్‌లోని పతంజలి యోగపీఠంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

పాఠశాలలు, కళాశాలల్లో కనీస సదుపాయాలు లేకపోవడం వల్లే విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలపాల్సిన పరిస్థితి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియలపై రామ్‌దేవ్ బాబా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఉద్యోగ ఎంపికల్లో ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతం అవినీతి జరుగుతోందని బాబా రామ్‌దేవ్ వ్యాఖ్యానించారు.

కులం, మతం, రాజకీయ భావజాలం ఆధారంగా ఇంటర్వ్యూయర్లు కొందరికి కొమ్ముకాస్తున్నారని, దీనివల్ల నిజమైన అర్హత కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. పేపర్ లీక్ ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రజాగ్రహం మరిన్ని ఆందోళనలకు దారితీయక ముందే ప్రభుత్వం నియామక వ్యవస్థలను ప్రక్షాళన చేయాలని సూచించారు.

అయితే నిరసనల పేరిట హింసను, అరాచకాన్ని తాను ఎప్పటికీ సమర్థించనని ఆయన స్పష్టం చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకదానినొకటి శత్రువులుగా చూసుకోకూడదని రామ్‌దేవ్ బాబా హితవు పలికారు. దేశంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య పరస్పర గౌరవం ఉండాలని పిలుపునిచ్చారు.

కాగా, ఇటీవల నీట్ (NEET) పేపర్ లీక్ తీవ్ర దుమారం రేపడం, అలాగే ఝార్ఖండ్‌లో ఉద్యోగ నియామక పరీక్షల అక్రమాలపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story