Jharkhand Student Protest: రాంచీలో విద్యార్థులపై లాఠీఛార్జ్.. 600 మందిపై ఎఫ్‌ఐఆర్!

Jharkhand Student Protest: జార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ, జేఎస్ఎస్సీ పరీక్షల అక్రమాలపై విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి.

Arun Chilukuri
Published on: 13 Aug 2026 2:47 PM IST
Jharkhand Student Protest
X

Jharkhand Student Protest: రాంచీలో విద్యార్థులపై లాఠీఛార్జ్.. 600 మందిపై ఎఫ్‌ఐఆర్!

Jharkhand Student Protest: జార్ఖండ్ రాజధాని రాంచీ ఉద్యోగార్థులు, విద్యార్థుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ రిక్రూట్‌మెంట్ పరీక్షలలో అక్రమాలు జరిగాయంటూ ‘JPSC-JSSC రిఫార్మ్స్ మంచ్’ ఆధ్వర్యంలో రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో చేపట్టిన నిరసన ప్రదర్శన గురువారానికి 20వ రోజుకు చేరుకుంది.

పరీక్షల్లో పారదర్శకత పాటించాలని, అక్రమాలు జరిగిన పరీక్షలను రద్దు చేసి సీబీఐ (CBI) లేదా రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన అసెంబ్లీ దిగ్బంధనం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అసెంబ్లీ దిగ్బంధనానికి శాంతియుతంగా మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా విరుచుకుపడ్డారు. లాఠీఛార్జ్ చేయడంతో పాటు వాటర్ కెనన్లు, భాష్పవాయు గోళాలను ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

అంతేకాకుండా శాంతిభద్రతల ఉల్లంఘన నెపంతో 600 మంది నిరసనకారులపై పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. ఇందులో 100 మంది పేర్లను నేరుగా చేర్చగా, మరో 500 మంది అజ్ఞాత విద్యార్థులను నిందితులుగా చేర్చడం సంచలనం సృష్టిస్తోంది. పోలీసుల చర్యను నిరసిస్తూ ప్రతిపక్ష బీజేపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. సీఎం హేమంత్ సోరెన్ ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని చూస్తోందని మండిపడింది.

వారం రోజుల్లోగా ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్ దాస్ హెచ్చరించారు. 2024 ఎక్సైజ్ కానిస్టేబుల్ శారీరక పరీక్షల సమయంలో ప్రాణాలు కోల్పోయిన 19 మంది అభ్యర్థుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం వేసిన SIT కమిటీపై నమ్మకం లేదని, దేశవ్యాప్తంగా 1,200కి పైగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు చేపడతామని ఏబీవీపీ (ABVP) స్పష్టం చేసింది.

బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల ఉద్యమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని రప్పించి నిరసనలను హింసాత్మకంగా మారుస్తోందని మండిపడింది.

మరోవైపు, రిక్రూట్మెంట్ పరీక్షల సంస్కరణలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యర్థన మేరకు 14వ JPSC పరీక్షను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులతో ప్రభుత్వం జరిపిన 6 విడతల చర్చలు విఫలమైనప్పటికీ, సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story