పింక్ రైడ్ బుక్ బుక్ చేస్తే మగ డ్రైవర్ వచ్చాడు.. ఎందుకని ప్రశ్నిస్తే ఊహించని సమాధానం!
Viral News: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా అందిస్తున్న రాపిడో ‘పింక్’ రైడ్ సేవలో ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది.
పింక్ రైడ్ బుక్ బుక్ చేస్తే మగ డ్రైవర్ వచ్చాడు.. ఎందుకని ప్రశ్నిస్తే ఊహించని సమాధానం!
Viral News: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా అందిస్తున్న రాపిడో ‘పింక్’ రైడ్ సేవలో ఓ మహిళకు ఊహించని అనుభవం ఎదురైంది. డిజిటల్ క్రియేటర్ షాలిని చతుర్వేది తనకు ఎదురైన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పంచుకున్నారు.
మహిళా ఫొటోతో పురుషుడు.. భద్రతపై ఆందోళన
తాను మహిళా డ్రైవర్ వస్తారని భావించి రాపిడో పింక్ రైడ్ బుక్ చేసుకున్నానని, అయితే తన రైడ్‌కు ఓ పురుష డ్రైవర్‌ను కేటాయించారని ఆమె తెలిపారు. రైడ్‌కు సంబంధించిన డ్రైవర్ తనకు ఫోన్ చేసినప్పుడు పురుషుడి గొంతు వినిపించిందని షాలిని చెప్పారు. తాను పింక్ రైడ్ బుక్ చేశానని, మహిళా డ్రైవర్ వస్తారని భావించానని చెప్పగా.. ఆ వ్యక్తి ‘మేడమ్.. నేను గే’ అని చెప్పినట్లు ఆమె వెల్లడించారు.
ఈ ఘటన తనకు అసౌకర్యంగా అనిపించడంతో వెంటనే రైడ్‌ను క్యాన్సిల్ చేయాలని నిర్ణయించుకున్నారు. రైడ్ క్యాన్సిల్ చేసుకునే సమయంలో తనకు రూ.15 క్యాన్సిలేషన్ ఫీజు చూపించిందని షాలిని తెలిపారు. తాను బుక్ చేసిన ప్రయాణం మొత్తం ఖర్చు సుమారు రూ.25 మాత్రమేనని చెప్పారు. మరోవైపు యాప్‌లో కనిపించిన రాపిడో కెప్టెన్ ప్రొఫైల్ ఫొటో మహిళదిగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. కానీ పికప్ ప్రాంతానికి పురుషుడు వచ్చినట్లు తెలిపారు.
ఆ వ్యక్తి తనను ప్రత్యక్షంగా చూశాడని, తాను ఏ భవనంలో ఉంటానో కూడా అతనికి తెలిసిపోయిందని షాలిని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా అందించే సేవలో ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. మహిళల భద్రతను కేవలం వ్యాపార అవకాశంగా చూడటం సరికాదని ఆమె విమర్శించారు. మహిళల నుంచి ప్రత్యేకంగా ఎక్కువ చార్జీలు తీసుకున్నా.. భద్రత విషయంలో మాత్రం హామీ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు.
రాపిడో క్షమాపణ.. దర్యాప్తుకు హామీ
ఈ ఘటనపై స్పందించిన రాపిడో షాలినికి క్షమాపణలు చెప్పింది. ‘బైక్ పింక్’ రైడ్లను మహిళా కెప్టెన్లకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. అలాంటి రైడ్ పురుష కెప్టెన్‌కు ఎలా కేటాయించారో పరిశీలిస్తామని తెలిపింది. అలాగే డ్రైవర్ ప్రవర్తనపై కూడా దర్యాప్తు చేస్తామని రాపిడో వెల్లడించింది. పరిస్థితులను బట్టి క్యాన్సిలేషన్ ఛార్జీ విధించడం కూడా సరికాదని పేర్కొంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, రైడ్ ఐడీని డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపాలని షాలినిని కోరింది.
డ్రైవర్ అకౌంట్ తొలగింపు.. నెటిజన్ల ప్రశ్నలు
తర్వాత రాపిడో ఈ ఘటనపై మరోసారి చర్యలు తీసుకున్నట్లు షాలిని తెలిపారు. మొదట డ్రైవర్‌కు కేవలం హెచ్చరిక ఇస్తామని కంపెనీ చెప్పిందని, దీనిపై తాను అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె వెల్లడించారు. మహిళా బంధువు ప్రొఫైల్ ఫొటోను ఉపయోగించి ఆ వ్యక్తి పింక్ సర్వీస్‌లోకి వచ్చినట్లు తనకు తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంపై మరోసారి రాపిడోతో మాట్లాడిన తర్వాత కంపెనీ డ్రైవర్ ఐడీని తొలగించిందని షాలిని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా కంపెనీ తనతో పంచుకుందని చెప్పారు. దీంతో తన ఫిర్యాదుకు పరిష్కారం లభించిందని ఆమె పేర్కొన్నారు.
ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు తమకు కూడా రైడ్‌హెయిలింగ్ సేవల్లో ఇలాంటి సమస్యలు ఎదురయ్యాయని కామెంట్ చేశారు. మరికొందరు డ్రైవర్ల గుర్తింపు, ప్రొఫైల్ ఫొటోలు, వాహనాలు, డ్రైవింగ్ విధానం వంటి అంశాల్లో కంపెనీలు మరింత కఠినమైన తనిఖీలు చేయాలని సూచించారు. రైడ్ బుక్ చేసిన ప్రయాణికుల భద్రత విషయంలో ప్లాట్‌ఫామ్‌ల బాధ్యత ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు కూడా ఈ ఘటనతో మరోసారి చర్చకు వచ్చాయి.




