పార్సిల్ ఇచ్చిన కాసేపటికే.. మహిళకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ ర్యాపిడో రైడర్ వేధింపులు!

Noida: నోయిడాలో పార్సిల్ డెలివరీ చేసిన ర్యాపిడో రైడర్ మహిళకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ అసభ్యకర మెసేజ్‌లు పంపి వేధించిన ఘటన వైరల్ అయింది.

Arun Chilukuri
Published on: 9 Sept 2026 12:51 PM IST
పార్సిల్ ఇచ్చిన కాసేపటికే.. మహిళకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ ర్యాపిడో రైడర్ వేధింపులు!
X

పార్సిల్ ఇచ్చిన కాసేపటికే.. మహిళకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ ర్యాపిడో రైడర్ వేధింపులు!

Noida: నోయిడాలో మహిళా భద్రతకు మరోసారి ప్రశ్నార్థకం ఎదురైంది. పార్సిల్ డెలివరీ చేయడానికి వచ్చిన ఓ ర్యాపిడో రైడర్.. ఆ తర్వాత ఆ మహిళకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి తీవ్ర వేధింపులకు గురిచేసిన ఘటన సామాజిక మాధ్యమాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే.. నోయిడాకు చెందిన ఓ మహిళకు ర్యాపిడో ద్వారా పార్సిల్ అందింది. అయితే డెలివరీ ముగిసిన కొద్దిసేపటికే ఆ రైడర్ ఆమె వ్యక్తిగత నంబర్‌కు ‘హలో.. ఎలా ఉన్నారు?’ అంటూ మెసేజ్ చేశాడు. ఆ వెంటనే ఏమాత్రం సంకోచించకుండా ‘ఐ లవ్‌ యూ’ అంటూ మరో సందేశం పంపాడు. ఈ అనూహ్య పరిణామానికి తీవ్ర అసౌకర్యానికి గురైన ఆ మహిళ.. తనకు ఇలాంటి మెసేజ్‌లు పెట్టవద్దని, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది.

అయినప్పటికీ ఆ రైడర్ లో ఏమాత్రం భయం కనిపించలేదు. సరికదా మరింత దురుసుగా స్పందిస్తూ.. ‘ఎక్కడైనా ఫిర్యాదు చేసుకో.. రాపిడోలో చేయి’ అంటూ ఎగతాళిగా బదులిచ్చాడు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన వాట్సాప్ స్క్రీన్‌షాట్లను సదరు బాధితురాలు ప్రముఖ సోషల్ మీడియా వేదిక అయిన లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. డెలివరీ యాప్‌లలో పనిచేసే రైడర్ల నేపథ్య తనిఖీ, మహిళా ప్రయాణికులు వినియోగదారుల భద్రతపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ స్పందించింది. బాధితురాలికి క్షమాపణలు చెబుతూ.. వినియోగదారుల భద్రత, గౌరవం తమకు అత్యంత ప్రాధాన్యమని పేర్కొంది. అయితే, ఆ కాంటాక్ట్ రైడర్‌పై కంపెనీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుందనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. మహిళల భద్రతతో చెలగాటమాడుతున్న ఇలాంటి వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story