Rare Monkeys: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్లు.. అధికారులకు షాక్!
Rare Monkeys: ఒడిశాలోని బాలాసోర్ అడవుల్లో ఐదు అరుదైన ఒరంగుటాన్లు కనిపించాయి. అక్రమ వన్యప్రాణుల రవాణాపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Rare Monkeys: ఒడిశా అడవుల్లో అరుదైన ఒరంగుటాన్లు.. అధికారులకు షాక్!
Rare Monkeys: ఒడిశాలోని బాలాసోర్ జిల్లా అడవుల్లో ఐదు అరుదైన ఒరంగుటాన్లు కనిపించడం కలకలం రేపింది. భోగ్రాయ్ ప్రాంతంలోని బడపై గ్రామం సమీపంలో చెట్లపై ఈ వానరాలను స్థానికులు గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని ఐదు ఒరంగుటాన్లను రక్షించారు. వాటిలో నాలుగు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పశువైద్య నిపుణులు వాటికి వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
ఇండోనేషియా, మలేషియాలో సహజ ఆవాసాలు
ఒరంగుటాన్లు భారతదేశంలోని అడవుల్లో సహజంగా కనిపించే జంతువులు కావు. ఇవి ప్రధానంగా ఇండోనేషియా, మలేషియాలోని ఉష్ణమండల అటవీ ప్రాంతాల్లో జీవిస్తాయి. అలాంటి జంతువులు ఒడిశా అడవుల్లో ఒకేసారి ఐదు కనిపించడంతో అటవీశాఖ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. వాటి సహజ ఆవాసాలకు ఒడిశా దాదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అక్రమ రవాణాపై అధికారుల దర్యాప్తు
ఒరంగుటాన్లు ఒడిశాకు ఎలా చేరుకున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాలకు ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చన్న అనుమానంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. జంతువులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తరలించారు, చివరకు అవి అడవిలోకి ఎలా చేరుకున్నాయనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటన వెనుక ఉన్న వ్యక్తులు లేదా నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఒరంగుటాన్లను సురక్షితంగా సంరక్షించేందుకు చర్యలు చేపట్టారు.
నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు తరలించే అవకాశం
ఒరంగుటాన్లను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవడంతో అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని వాటిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వాటి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించిన అనంతరం తదుపరి సంరక్షణ కోసం నందన్‌కానన్ జూలాజికల్ పార్క్‌కు తరలించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అరుదైన, అంతరించిపోతున్న జాతులకు చెందిన వన్యప్రాణులను అక్రమంగా తరలించడం వాటి ప్రాణాలకు తీవ్ర ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలాసోర్‌లో వెలుగుచూసిన ఈ ఘటన అంతర్జాతీయ వన్యప్రాణుల అక్రమ రవాణాపై మరోసారి దృష్టిని మళ్లించింది.




