రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. అంతలోనే భారీ పేలుడు
Madhya Pradesh: తీపి రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్న ఒక పదార్థం ఒక్కసారిగా బాంబులా పేలడంతో 35 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన.
రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్నాడు.. అంతలోనే భారీ పేలుడు
Madhya Pradesh: తీపి రసగుల్లా అనుకుని నోట్లో పెట్టుకున్న ఒక పదార్థం ఒక్కసారిగా బాంబులా పేలడంతో 35 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలో కలకలం రేపింది. తెలిసిన వ్యక్తే మిఠాయి రూపంలో ఉన్న నాటుబాంబును ఇవ్వడం, దాన్ని కొరకగానే నోట్లోనే పేలిపోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది.
మంట చుట్టూ కూర్చుని మాట్లాడుతుండగా..
పడరియా ఛంటా గ్రామానికి చెందిన రాజేంద్ర బరౌతియా (35) మంగళవారం (నవంబర్ 10) రాత్రి భోజనం ముగించుకుని తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి బయట మంట చుట్టూ కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. సుమారు రాత్రి 8 గంటల సమయంలో రాంభగత్ బరౌతియా అనే తెలిసిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. మాటల మధ్యలో అతను రాజేంద్రకు ఒక గుండ్రని వస్తువును ఇస్తూ.. అది 'రసగుల్లా' అని చెప్పాడు.
నిజంగానే అది తియ్యటి రసగుల్లా అని నమ్మిన రాజేంద్ర ఏమాత్రం ఆలోచించకుండా దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పళ్లతో కొరకగానే ఒక్కసారిగా భారీ శబ్దంతో అది అతని నోట్లోనే పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి రాజేంద్ర దవడ పూర్తిగా ఛిద్రమై తీవ్ర రక్తస్రావమైంది. హుటాహుటిన కుటుంబ సభ్యులు అతడిని ఆటోలో జిల్లా ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు.
అసలేంటి ఆ బాంబు? ఎందుకు పేలింది?
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అది రసగుల్లా కాదని, గ్రామీణ ప్రాంతాల్లో అడవి పందులను వేటాడేందుకు ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన నాటుబాంబు అని తేలింది. ఆహార పదార్థం ఆకారంలో గుండ్రంగా ఉండే ఈ నాసిరకమైన పేలుడు పదార్థాలను జంతువులు కొరకగానే పేలిపోయేలా తయారు చేస్తారు. చూడటానికి అచ్చం మిఠాయిలా ఉండటంతో రాజేంద్ర దాన్ని రసగుల్లాగా పొరబడి ప్రాణాలు కోల్పోయాడు.
అల్లరి పనా.. లేక పక్కా ప్లాన్ తో హత్యా?
ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అడవి పందులను చంపడానికి గిరిజనులు వాడే ఈ బాంబును నిందితుడికి ఎవరు ఇచ్చారనే కోణంలో ఆరా తీస్తున్నారు. "అతని నోట్లోనే బాంబు పేలింది. అయితే, దీని వెనుక చంపాలనే ఉద్దేశ్యం ఉందా లేక ఏదైనా అల్లరి చేయబోయి ఇలా జరిగిందా అనేది విచారిస్తున్నాం" అని పోలీస్ అధికారిణి రేఖా సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105తో పాటు పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.




