Ration Card: రేష‌న్ కార్డులున్న వారికి కీల‌క అప్డేట్‌.. అంత్యోద‌య కార్డుల్లో భారీ మార్పులు

Ration Card: రేషన్ పంపిణీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

Mokshith
Published on: 27 Jun 2026 3:05 PM IST
Ration Card
X

Ration Card: రేష‌న్ కార్డులున్న వారికి కీల‌క అప్డేట్‌.. అంత్యోద‌య కార్డుల్లో భారీ మార్పులు

Ration Card: రేషన్ పంపిణీ విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా అంత్యోదయ అన్న యోజన (AAY) కింద రేషన్ పొందుతున్న కుటుంబాలకు అమలవుతున్న విధానంలో సవరణలు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటి వరకు అమలులో ఉన్న విధానం ఎలా ఉంది?

ప్రస్తుతం అంత్యోదయ అన్న యోజన కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా నెలకు 35 కిలోల ఉచిత బియ్యం లేదా గోధుమలు అందిస్తున్నారు. కుటుంబంలో ఇద్దరు ఉన్నా, ఆరుగురు ఉన్నా ఒకే పరిమాణంలో రేషన్ అందుతోంది.

అత్యంత పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎన్నో సంవత్సరాలుగా అమలు చేస్తున్నారు. అయితే చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలకు ఒకే పరిమాణంలో రేషన్ ఇవ్వడం వల్ల సమానత్వం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.

కొత్త నిబంధనలో ఏం మార‌నుంది.?

కొత్త ప్రతిపాదన ప్రకారం, ఇకపై కుటుంబంలోని ప్రతి సభ్యుడికి 7 కిలోల చొప్పున రేషన్ కేటాయించనున్నారు. ఉదాహరణకు కుటుంబంలో ఇద్దరు సభ్యులు ఉంటే 14 కిలోలు, ముగ్గురు ఉంటే 21 కిలోలు, నలుగురు ఉంటే 28 కిలోలు అందిస్తారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్న కుటుంబాలకు మాత్రం గరిష్టంగా 35 కిలోల రేషన్ కొనసాగుతుంది. అంటే ఐదుగురి వరకు వ్యక్తుల సంఖ్య ఆధారంగా రేషన్ పరిమాణం నిర్ణ‌యిస్తారు. ఐదుగురికి మించిన కుటుంబాలకు ప్రస్తుతం అమలులో ఉన్న గరిష్ట పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు.

చట్టంలో సవరణలకు కేంద్రం సిద్ధం

ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలంటే జాతీయ ఆహార భద్రత చట్టం-2013లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ ముసాయిదాను విడుదల చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తోంది. ఈ ప్రతిపాదనలపై జూలై 13 వరకు సూచనలు, అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.

ప్రతి వ్యక్తికి అవసరమైన మేరకు మాత్రమే ఆహార ధాన్యాలు అందేలా వ్యవస్థను మరింత సమర్థంగా మార్చడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశమని కేంద్రం వెల్లడించింది.

సాధారణ రేషన్ కార్డుదారులకు ఎలాంటి మార్పులు లేవు

ఈ మార్పులు కేవలం అంత్యోదయ అన్న యోజన (AAY) కార్డులకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణ ప్రాధాన్య కుటుంబాల (Priority Household) రేషన్ కార్డుదారులకు ప్రస్తుతం అమలులో ఉన్న విధంగానే ప్రతి వ్యక్తికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత ధాన్యం కొన‌సాగుతుంది. అందువల్ల సాధారణ రేషన్ కార్డులు కలిగిన లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. ఈ సవరణలు కేవలం అంత్యోదయ పథకం లబ్ధిదారుల పంపిణీ విధానానికే పరిమితం కానున్నాయి.

ఈ మార్పుల వెనుక కేంద్రం ఉద్దేశం ఏమిటి?

కుటుంబ పరిమాణాన్ని బట్టి రేషన్ పంపిణీలో సమతుల్యత తీసుకురావడమే ఈ మార్పుల లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. చిన్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలకు ఒకే పరిమాణంలో రేషన్ ఇవ్వడం వల్ల అసమానతలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే వ్యక్తుల సంఖ్యను ఆధారంగా తీసుకుని పంపిణీ చేస్తే ఆహార ధాన్యాల వినియోగం మరింత సమర్థంగా ఉంటుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

అలాగే అర్హులైన ప్రతి వ్యక్తికి తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించి దేశంలో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతోనే ఈ మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చట్ట సవరణ పూర్తయిన తర్వాత ఈ కొత్త విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story