2027లో వడ్డీ రేట్ల మోత.. గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా ఇదే.!
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లను వరుసగా పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్
RBI Interest Rates
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) రాబోయే రోజుల్లో కీలక వడ్డీ రేట్లను వరుసగా పెంచే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మ్యాన్ శాక్స్ (Goldman Sachs) అంచనా వేసింది. జూన్ 2027 నాటికి ఆర్బీఐ మరో మూడు దఫాలుగా దాదాపు 75 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని గోల్డ్‌మ్యాన్ శాక్స్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ శాంతను సెన్‌గుప్తా స్పష్టం చేశారు. ఎన్‌డీటీవీ ప్రాఫిట్ నివేదిక ప్రకారం.. గ్లోబల్ సవాళ్లు, క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు , ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ భారత్ సుమారు 7 శాతం ఆర్థిక వృద్ధి రేటును నమోదు చేయగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే భారత్ వంటి దేశానికి ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో ఈ స్థాయి వృద్ధి రేటును సాధించడం విశేషమని కొనియాడారు.
డిసెంబర్, ఫిబ్రవరి, ఏప్రిల్/జూన్‌లలో వడ్డీ రేట్ల పెంపు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో క్రమంగా వడ్డీ రేట్ల పెంపును అమల్లోకి తెస్తుందని గోల్డ్‌మ్యాన్ శాక్స్ అంచనా వేసింది. ముందుగా డిసెంబర్‌లో ఒకసారి, ఆ తర్వాత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండవసారి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని సెన్‌గుప్తా తెలిపారు. ఫిబ్రవరి పెంపు అనంతరం ఆర్థిక పరిస్థితులను, ద్రవ్యోల్బణాన్ని సమీక్షించేందుకు ఆర్బీఐ కొంత విరామం తీసుకోవచ్చని, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఏప్రిల్ లేదా జూన్ నెలలో మూడోసారి పెంపు చేపట్టవచ్చని విశ్లేషించారు.
ఎల్‌నినోతో 2027లో ద్రవ్యోల్బణం ముప్పు.. రబీ పంటపై తీవ్ర ప్రభావం
ఆర్థిక విపణిలో ఎల్‌నినో (El Nino) తెచ్చే ముప్పును చాలామంది ఆర్థిక నిపుణులు ఇంకా సరిగ్గా అంచనా వేయడం లేదని సెన్‌గుప్తా హెచ్చరించారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రస్తుత ఖరీఫ్ పంటపై పెద్దగా ప్రభావం ఉండకపోయినప్పటికీ, అసలైన ముప్పు భవిష్యత్తులోనే ఎదురుకానుందన్నారు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం వల్ల రాబోయే రబీ పంట దిగుబడి దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతానికి ఆహార ధాన్యాల నిల్వలు ఉండటం వల్ల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, 2027 నాటికి ఈ నిల్వలు తగ్గిపోయి ద్రవ్యోల్బణం (Inflation) వేగంగా పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దేశ ఆర్థిక వృద్ధి రేటు మందగించడానికి , ధరల పెరుగుదలకు కారణమవుతుందని హెచ్చరించారు.
రూ.100 దాటితే క్రూడ్ ఆయిల్ అతిపెద్ద సవాలు
భారత ఆర్థిక వ్యవస్థకు బ్యారెల్ ముడిచమురు (Crude Oil) ధర అత్యంత కీలకమైన అంశమని సెన్‌గుప్తా పేర్కొన్నారు. తమ ప్రస్తుత అంచనాలు బ్యారెల్ ఆయిల్ ధర $85 నుంచి $95 డాలర్ల మధ్య ఉంటుందనే అంచనాతో రూపొందించినవని, ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర స్థిరంగా $100 డాలర్లు దాటితే మాత్రం అది భారత వృద్ధి రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్థను మరింత ప్రేరేపించడానికి జిఎస్టి (GST) పన్ను కోతలు లేదా ఆదాయపు పన్ను సడలింపులు (Income Tax Cuts) ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.




