Repo Rate : RBI బిగ్ డెసిషన్.. EMI కట్టేవారికి భారీ ఊరట.!
Repo Rate : అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ సవాళ్లు , ఎప్పటికప్పుడు మారుతున్న చమురు ధరల
RBI-Repo-Rate
Repo Rate : అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి, వివిధ ప్రాంతాల్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ సవాళ్లు , ఎప్పటికప్పుడు మారుతున్న చమురు ధరల నడుమ భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. ఆరుగురు సభ్యులతో కూడిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎమ్‌పీసీ) ద్వైమాసిక సమావేశంలో బెంచ్‌మార్క్ వడ్డీ రేటు అయిన పాలసీ రెపో రేటును ఎటువంటి మార్పు లేకుండా 5.25 శాతం వద్దే యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. దీనితో పాటు ప్రస్తుత అంతర్జాతీయ , దేశీయ ఆర్థిక పరిస్థితులకు అత్యంత అనుకూలమైన 'న్యూట్రల్' (తటస్థ) వైఖరినే ముందుకు తీసుకెళ్లాలని కమిటీ స్పష్టం చేసింది.
వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేదు..
గత కొన్ని సమీక్షల నుంచి ఆర్బీఐ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకుండా స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న ఒడుదొడుకులు, అంతర్జాతీయ వాణిజ్య విధానాలు , ప్రపంచ సరఫరా వ్యవస్థలపై పడుతున్న ప్రభావాలను నిశితంగా పరిశీలించిన పిదప ఈ సమతుల్య నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. దేశీయంగా ద్రవ్యోల్బణం నియంత్రణ పరిమితుల్లోనే ఉన్నప్పటికీ, విదేశీ పరిణామాల వల్ల మార్కెట్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉండటంతో ఆర్బీఐ ముందస్తు జాగ్రత్త చర్యగా స్థిరమైన విధానాన్ని ఎంచుకుంది.
మధ్యతరగతి కుటుంబాలకు ఊరట..
రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచకపోవడం వల్ల బ్యాంకింగ్ రంగంలో రుణాల వడ్డీ రేట్లు తక్షణమే పెరిగే అవకాశం లేదు. గృహ రుణాలు, వాహన రుణాలు , ఇతర వ్యక్తిగత రుణాలు పొందిన కోట్లాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం. సాధారణంగా ఆర్బీఐ బెంచ్‌మార్క్ రేట్లను పెంచినప్పుడు బ్యాంకులు తమ రుణ రేట్లను పెంచి నెలవారీ ఈఎంఐల భారాన్ని కస్టమర్లపై మోపుతుంటాయి. అయితే ప్రస్తుత నిర్ణయం వల్ల ప్రయాణికులు, ఇళ్ల కొనుగోలుదారులు , వాహనదారుల నెలవారీ ఈఎంఐలలో ఎలాంటి అదనపు భారం పడదు. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా బ్యాంకులు కూడా తమ ప్రస్తుత డిపాజిట్ , రుణ రేట్లనే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నా..
పాలసీ వివరాలను వెల్లడిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు, ప్రధాన వాణిజ్య సముద్ర మార్గాల్లో ఏర్పడుతున్న అంతరాయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు , అంతర్జాతీయ సరఫరా గొలుసుకు పెద్ద సవాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు. ఈ భౌగోళిక ఉద్రిక్తతల వల్ల ముడిచమురు సరఫరా , ధరల్లో తీవ్ర ఒడుదొడుకులు చోటుచేసుకుంటున్నాయని, ఇది చాలా దేశాల్లో దిగుమతి చేసుకునే ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
అయితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రతికూల పరిస్థితులు, ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత స్థిరత్వంతో నిలబడిందని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరుగుతుండటం, పట్టణాల్లో బలమైన డిమాండ్, పారిశ్రామిక , సేవా రంగాల్లో ప్రగతి భారత్‌ను కొండంత అండగా ముందుకు నడిపిస్తున్నాయని విశ్లేషించారు. విదేశీ మారక నిల్వలు బలంగా ఉండటం మన వ్యవస్థకు రక్షణగా నిలుస్తుందని చెప్పారు. ఎంతటి గ్లోబల్ సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ అధిగమిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోందని ఆర్బీఐ స్పష్టం చేసింది.




