Supreme Court: అరెస్టైన విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

Supreme Court: పేపర్ లీక్ నిరసనల్లో అరెస్టైన విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ ఊరట. మైనర్లు, నేరచరిత్ర లేనివారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశం. ఎఫ్‌ఐఆర్‌లపై కఠిన చర్యలు నిలిపివేత.

Arun Chilukuri
Published on: 28 July 2026 1:10 PM IST
Supreme Court
X

Supreme Court: అరెస్టైన విద్యార్థులకు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్!

Supreme Court: దేశవ్యాప్తంగా కలకలం రేపిన పోటీ పరీక్షల పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టి అరెస్టైన విద్యార్థులకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. నిరసనల సందర్భంగా అదుపులోకి తీసుకున్న 18 ఏళ్లలోపు ఉన్న మైనర్లతో పాటు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు బిహార్, అస్సాం తదితర రాష్ట్రాల్లో జరిగిన విద్యార్థి నిరసనల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి విద్యార్థులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసు శాఖలను ఆదేశించింది.

ఈ తాత్కాలిక రక్షణ కేవలం నిరసనల్లో పాల్గొన్న అమాయక విద్యార్థులకు మాత్రమేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పటికే ఇతర తీవ్ర నేరాల్లో ప్రమేయం ఉండి, క్రిమినల్ రికార్డులు ఉన్నవారికి ఈ ఉత్తర్వులు వర్తించవని కోర్టు తేల్చిచెప్పింది.

ప్రజస్వామ్యంలో విద్యార్థులు తమ సమస్యలు, ఆవేదనలపై శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కేనని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పునరుద్ఘాటించింది. కేవలం ఆందోళన చేపడుతున్నారనే కారణంతో లాఠీఛార్జ్ లేదా మితిమీరిన బలప్రయోగం చేయడం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

పరీక్షా పేపర్ లీక్‌లు, వాటికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలపై పోలీసుల మితిమీరిన చర్యలు, అలాగే ఆందోళనల్లో పోలీసులకు జరిగిన గాయాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సమగ్ర విచారణ జరుపుతోంది. భవిష్యత్తులో నిరసనల నిర్వహణకు ఒకే రకమైన పోలీస్ ప్రోటోకాల్ మరియు విద్యార్థుల హక్కుల పరిరక్షణకు సంబంధించి మరిన్ని మార్గదర్శకాలు జారీ చేసే అవకాశముంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story