True Love Story: భార్య మృతదేహాన్ని పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి.. తాను పెళ్లి కొడుకై అరుదైన వీడ్కోలు
True Love Story: రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
True Love Story
True Love Story: రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ఓ హృదయ విదారక ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన వైవాహిక బంధం ముగిసినా, భార్యపై ఉన్న అంతులేని ప్రేమను చాటుకుంటూ ఓ రిటైర్డ్ అధికారి చేసిన పని ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. బికనీర్‌లోని గంగాషహర్ రోడ్డు ప్రాంతానికి చెందిన రాజేంద్ర ప్రసాద్ జోషి (65) ఇన్ఫర్మేషన్ పబ్లిక రిలేషన్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన భార్య అమిత్ జోషి (63) గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన రాజేంద్ర జోషి.. ఆమెకు అత్యంత వినూత్న రీతిలో కన్నీటి వీడ్కోలు పలికారు.
పెళ్లికూతురిలా ముస్తాబు చేసి.. పెళ్లికొడుకుగా మారిన భర్త
భార్య కోల్పోయిన దుఃఖంలోనూ రాజేంద్ర జోషి ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. "తాను ఇంటికి కోడలిగా ఎలా తెచ్చానో, అలాగే చివరి ప్రయాణానికి పంపిస్తానని" ఆయన భావించారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యుల సహకారంతో అమిత్ జోషి మృతదేహాన్ని ఎర్రటి పెళ్లి చీర, సంప్రదాయ ఆభరణాలతో అచ్చం పెళ్లికూతురిలా సుందరంగా అలంకరించారు. అంతేకాకుండా భర్త రాజేంద్ర ప్రసాద్ జోషి స్వయంగా పెళ్లికొడుకులా తెల్లటి దుస్తులు ధరించి భార్య అంత్యక్రియల యాత్రలో పాల్గొన్నారు. చావు కూడా తమ బంధాన్ని విడదీయలేదనే నిజాన్ని ఈ ఘటన సజీవంగా నిరూపించింది.
మారుమోగిన బాజా భజంత్రీలు
సాధారణంగా అంత్యక్రియల సమయంలో అంతా విషాద వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం భార్యను సాగనంపే వేళ ముందుగా బాజా భజంత్రీలు, పెళ్లి సమయంలో వినిపించే మంగళవాయిద్యాల ధ్వనులు మారుమోగాయి. బంధువులు, స్థానికులు వెనుకరాగా రామనామ సంకీర్తనం చేస్తూ అంతిమయాత్రను మోక్షధామం వరకు సాగించారు. ఇక శ్మశానవాటికలో భార్య చివరకు వీడ్కోలు పలికే సమయంలో తన భావాలను అదుపులో ఉంచుకోలేక రాజేంద్ర జోషి గుండెలు పగిలేలా ఏడ్చేశారు. ఆయన రోదనను చూసి అక్కడున్న ప్రతి ఒక్కరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.
ఆదర్శంగా నిలిచిన దంపతులు
రాజేంద్ర ప్రసాద్ జోషి, అమిత్ జోషిల వివాహం ఫిబ్రవరి 18, 1984లో ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత బికనీర్‌కు వచ్చిన అమిత్ జోషి, భార్యతో కలిసి గత 42 సంవత్సరాలుగా ఎంతో అన్యోన్యంగా సంసారాన్ని సాగించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు ఇంజనీర్‌గా, చిన్న కుమారుడు వెటర్నరీ డాక్టర్‌గా స్థిరపడ్డారు. భార్య అనారోగ్యంతో ఉన్నన్నాళ్లు కంటికి రెప్పలా చూసుకున్న రాజేంద్ర జోషి.. చివరి క్షణంలో ఆమెకు ఇచ్చిన ఈ అపూర్వ వీడ్కోలు నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.




