Robotic surgery: బెంగళూరులో 16 రోజుల పసికందుకు విజయవంతంగా రోబోటిక్ సర్జరీ

Robotic surgery: బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో అరుదైన ఘనత. 16 రోజుల శిశువుకు రోబోటిక్ సర్జరీ నిర్వహించి ప్రాణాలు కాపాడిన వైద్యులు.

KVD Varma
Published on: 22 March 2026 11:31 AM IST
Robotic surgery: బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో అరుదైన ఘనత
X

Robotic surgery

Robotic surgery: ప్రస్తుతం కొన్ని తీవ్రమైన ఆరోగ్య ఇబ్బందులతో బాధపడుతున్న రోగులకు రోబోటిక్ సర్జరీలు ఒక వరంలా మారాయి. ఒక్కోసారి ఆపరేషన్ నిర్వహించాల్సిన సమయంలో డాక్టర్లకు చిక్కులు ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా సున్నితమైన ఆపరేషన్ చేయాల్సివచ్చినపుడు.. ఎక్కడైతే ఆపరేషన్ అవసరమో ఆ ప్రదేశం పక్కన ఉన్న అవయవాలకు ప్రమాదం లేకుండా చికిత్స చేయాలంటే ఎంతో క్లిష్టంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో రోబోటిక్ సర్జరీ ఎంతో సహాయం చేస్తుంది. ఇదిగో ఇప్పుడు బెంగళూరులో ఒక పసికందుకు అలాంటి సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్లు. ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఒక కథనం ప్రకారం..

కాంజెనిటల్ హైపర్ ఇన్సులినిజం అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 రోజుల పసికందుకి వైట్‌ఫీల్డ్‌లోని మణిపాల్ ఆసుపత్రిలో రోబోటిక్ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది . తీవ్రమైన హైపోగ్లైసీమియా అంటే రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండటం కారణంగా ఆ పసికందు మెదడు శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదంలో ఉంది. 4.6 కిలోల బరువున్న ఆ నవజాత శిశువుకు అధిక మోతాదులో ఇంట్రావీనస్ గ్లూకోజ్ ఇస్తున్నప్పటికీ, రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పడిపోతుండటంతో, అత్యవసర చికిత్స అందించారు.

ఈ శిశువు ప్యాంక్రియాస్‌లో అధికంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తున్న ఒక చిన్న ఫోకల్ లెషన్‌ను వైద్యులు కనుగొన్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్యాంక్రియాసిస్ ను తొలగించాల్సి వస్తుంది. అయితే, ఈ సమస్య ఒక నిర్దిష్ట ప్రాంతానికే పరిమితం కావడంతో, రోబోటిక్ సర్జరీ చేయడం ద్వారా వారు మొత్తం ప్యాంక్రియాస్‌ను తొలగించకుండా ఆ నిర్దిష్ట ప్రాంతంలోనే శస్త్రచికిత్స చేయగలిగారు. దీనివల్ల దీర్ఘకాలిక దుష్ప్రభావాల ప్రమాదం తగ్గుతుందని చెబుతారు.

రోబోటిక్ శస్త్రచికిత్స ఎందుకు?

శిశువు వయస్సు, సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, వైద్యులు రోబోటిక్ సర్జరీని ఎంచుకున్నారు. దీని ద్వారా సమస్య ఉన్న ప్రాంతానికి ఖచ్చితంగా చికిత్స అందించారు. ఎలాంటి రక్తస్రావం లేదా సమస్యలు లేకుండా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆ తర్వాత శిశువు రక్తంలో చక్కెర స్థాయి వెంటనే సాధారణ స్థితికి రావడంతో, గ్లూకోజ్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. శిశువును తొమ్మిది రోజుల పాటు నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి, ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత తల్లిదండ్రులతో పాటు ఇంటికి పంపినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

KVD Varma

KVD Varma

Next Story