Mohan Bhagwat: సోషల్ మీడియా మాయలో యువత.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagwat: యువత క్రమంగా సోషల్ మీడియాకు బానిసలవుతూ తమలోని నైపుణ్యాలు, సృజనాత్మకతను కోల్పోతున్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు.
Mohan Bhagwat: సోషల్ మీడియా మాయలో యువత.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
Mohan Bhagwat: నేటి తరం యువత క్రమంగా సోషల్ మీడియాకు బానిసలవుతున్నారని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అధిపతి మోహన్ భాగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగిపోయి, చివరకు అవి ఒక వ్యసనంలా మారిపోయాయని అన్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించిన ‘మారు నినాద్-2026’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యువతకు మరియు సమాజానికి పలు కీలక సూచనలు చేశారు.
సోషల్ మీడియాపై అతిగా ఆధారపడటం వల్ల యువతలో ఉన్న సహజ నైపుణ్యాలు, సృజనాత్మకత, చైతన్యం వంటివి మరుగున పడిపోతున్నాయని మోహన్ భాగవత్ పేర్కొన్నారు. సాంకేతికతను, సామాజిక మాధ్యమాలను కేవలం అవసరం మేరకే వినియోగించుకోవాలని, వాటికి బానిసలు కాకూడదని యువతకు హితవు పలికారు.
దేశ అంతర్గత భద్రత, ఐక్యత గురించి మాట్లాడుతూ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో కులం, మతం పేరుతో అంతర్గత కలహాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజించడానికి కొందరు జాతి వ్యతిరేకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవి నాటి బ్రిటిష్ పాలనలోని ‘విభజించు-పాలించు’ విధానంలా ఉన్నాయని మండిపడ్డారు.
భారతదేశం అభివృద్ధి మార్గంలో వేగంగా దూసుకుపోవడం నచ్చని కొన్ని ప్రపంచ శక్తులు మనపై కుట్రలు పన్నుతున్నాయని, అటువంటి దుష్ట శక్తులకు మనలోని కొందరు వ్యక్తులు తెలియకుండానే సహకరిస్తున్నారని విమర్శించారు. ధర్మం వైపు నడవాలంటే ప్రతి ఒక్కరూ స్వార్థం, అహంకారం, అంతర్గత విభేదాలను విడనాడాలని పిలుపునిచ్చారు.
సమాజంలో ఐకమత్యం ఎంత అవసరమో వివరిస్తూ మోహన్ భాగవత్ మహాభారతాన్ని ఉదహరించారు. ‘‘భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ వంటి మహాయోధులు, అతిపెద్ద సైన్యం ఉన్నప్పటికీ.. కౌరవుల మధ్య ఉన్న అంతర్గత కలహాల కారణంగానే వారు ఓడిపోయారు. కానీ సైన్యం తక్కువ ఉన్నా సరే.. పాండవులు తమ ఐకమత్యంతో విజయం సాధించారు’’ అని గుర్తుచేశారు.




